హైదరాబాద్ కి జగన్, ఢిల్లీకి రేవంత్.. వీరిద్దరి కలయిక సాధ్యం కాదా..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని కలిసేందుకు ఈరోజు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ వెళ్తున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం హైదరాబాద్ లో అందుబాటులో ఉండకుండా ఢిల్లీకి వెళ్తుండటం విశేషం.

Advertisement
Update:2024-01-04 10:27 IST

ఇరుగు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తే పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అభినందించడం ఆనవాయితీ. అన్ని రాష్ట్రాల మధ్య ఇలాంటి సత్సంబంధాలు ఉంటాయనుకోలేం కానీ.. తెలుగు రాష్ట్రాల మధ్య ఉంటాయని ఆశించడంలో తప్పులేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదలై నెలరోజులైపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి కుదురుకుంటోంది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ మాత్రం ఇంతవరకు సాధ్యం కాలేదు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల విషయంలోనూ వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందనుకోలేం.

అటు.. ఇటు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని కలిసేందుకు ఈరోజు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ వెళ్తున్నారు. అదే సమయంలో కొత్త ముఖ్యమంత్రితో కూడా ఆయన భేటీ అవుతారనుకున్నా అది సాధ్యమయ్యేలా లేదు. తెలంగాణ సీఎం హైదరాబాద్ లో అందుబాటులో ఉండకుండా ఢిల్లీకి వెళ్తుండటం విశేషం. సరిగ్గా ఏపీ సీఎం జగన్, హైదరాబాద్ పర్యటన రోజే.. తెలంగాణ సీఎం రేవంత్, ఢిల్లీ పర్యటనకు వెళ్లడం యాదృశ్ఛికమా లేక ఉద్దేశపూర్వకమా అనేది తేలాల్సి ఉంది.

ఈరోజు హైదరాబాద్ చేరుకున్న అనంతరం బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని కేసీఆర్ ఇంటికి వెళ్తారు ఏపీ సీఎం జగన్. కేసీఆర్‌ ఇంటికి వెళ్తున్న జగన్‌ అక్కడే మధ్యాహ్న భోజనం కూడా చేస్తారు. ఆ తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందురు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై ఆయన క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల విషయంలో కూడా ఆశావహుల గురించి ఆయన పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News