వివేకా హత్య కేసుపై జగన్ మౌనం.. దేనికి సంకేతం..?

వివేకా సంబంధాలన్నీ ఒక్కొక్కటే బయటపెడుతున్నారు. పోనీ కుటుంబ పరువుకోసమే అప్పుడు వాటిని దాచిపెట్టారనుకుందాం, మరి ఇప్పుడు పరువుపోయినా పర్లేదా..? ఇన్ని విషయాలు బయటకొస్తున్నా జగన్ మౌనాన్ని వీడలేదు.

Advertisement
Update:2023-04-19 15:32 IST

వైఎస్ వివేకా హత్యకేసు విచారణపై ఏపీలో జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. హూ కిల్డ్ బాబాయ్ ఇంటూ టీడీపీ రెచ్చిపోతుంటే.. సీబీఐ విచారణను టీడీపీయే తప్పుదోవ పట్టించిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. భాస్కర్ రెడ్డి అరెస్ట్, అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో దాదాపుగా కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే భావించాలి. మరి ఇంత గొడవ జరుగుతున్నా సీఎం జగన్ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు..? జగన్ ప్రెస్ మీట్ పెడతారని, ప్రెస్ నోట్ విడుదల చేస్తారని అనుకోలేం.. కానీ శ్రీకాకుళం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, తన సొంత బాబాయ్ హత్య కేసుపై మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించారు. పోనీ కోర్టులో కేసు ఉండగా స్పందించడం సరికాదనుకుంటే.. వైసీీపీ నేతలు నేరుగా సీబీఐనే తప్పుబడుతున్నారు కదా..?

శ్రీకాకుళం జిల్లా సభలో జగన్ కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడలేదు. "మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు" అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. పదే పదే అబద్ధం చెబుతు న్నారు, చీకటి యుద్ధం చేస్తున్నారంటూ పరోక్షంగా తాజా రాజకీయ పరిణామాలను గుర్తు చేశారు.

జగన్ కంటే ఎవరికి ఎక్కువ తెలుసు..?

వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత ఆయనపై ఎవరూ వ్యక్తిగత దూషణలు చేయలేదు. పైగా ఆయన మరణంపై వైసీపీ సింపతీ చూపించింది కూడా. కానీ అరెస్ట్ ల వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారే సరికి వివేకా వ్యక్తిత్వ హననం మొదలైంది. ఆయన సంబంధాలన్నీ ఒక్కొక్కటే బయటపెడుతున్నారు. పోనీ కుటుంబ పరువుకోసమే అప్పుడు వాటిని దాచిపెట్టారనుకుందాం, మరి ఇప్పుడు పరువుపోయినా పర్లేదా..? దీనికి సమాధానం మాత్రం లేదు. ఇన్ని విషయాలు బయటకొస్తున్నా జగన్ మౌనాన్ని వీడలేదు. అసలు తన సొంత బాబాయ్ గురించి జగన్ కంటే ఎవరికి ఎక్కువగా తెలుసు అనేదే అసలు ప్రశ్న. కానీ జగన్ నోరు మెదపడంలేదు. గతంలో వివేకా హత్యకు టీడీపీయే కారణం అని ఆరోపించినవారిలో జగన్ కూడా ఉన్నారు. పోనీ ఇప్పటికీ ఆయన అదే స్టాండ్ పై ఉన్నారా, లేక అవినాష్ కి మద్దతుగా మాట్లాడతారా అనేది తేలడంలేదు. అసలు వివేకా హత్యకేసుకి సంబంధించి ఇటీవల కాలంలో జగన్ ఒక్క మాట కూడా మాట్లడకపోవడం విశే్షం. 

Tags:    
Advertisement

Similar News