అప్పలరాజు ఔట్...! తమ్మినేనికి ఛాన్స్..!! జగన్ టీమ్-3 లో ఎవరెవరు..?

గతంలో మంత్రి పదవులు లేని సామాజిక వర్గాలను ఏరికోరి జగన్ కేబినెట్ లోకి తీసుకుంటారని అంటున్నారు. ఈనెల 3న జరిగే ఎమ్మెల్యేల మీటింగ్ లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

Advertisement
Update:2023-04-01 07:17 IST

కేబినెట్ ప్రమాణ స్వీకారం రోజే సీఎం జగన్ తన మనసులో మాట బయటపెట్టారు. రెండేళ్లకోసారి మంత్రి పదవులు మారుస్తానని, ఎన్నికల ఏడాది పటిష్టమైన టీమ్ తో రంగంలోకి దిగుతామని చెప్పారు. అన్నట్టుగానే రెండేళ్లకు కొత్తవారికి అవకాశమిచ్చారు, పాతవారిలో కొందర్ని తొలగించారు. ఎన్నికల ఏడాదిలో ప్రయోగాలెందుకు చేస్తారులే అని అనుకున్నారంతా, కానీ జగన్ తన అలోచనను మరోసారి అమలులో పెట్టారు. ఎన్నికలకింకా ఏడాది టైమ్ ఉండగా మళ్లీ మంత్రి వర్గంలో ప్రక్షాళణ మొదలు పెట్టారు. కొత్తవారికి ఛాన్స్ లు ఇవ్వబోతున్నారు, పాతవారిని పక్కనపెడుతున్నారు. మార్పులు చేర్పులకు ప్రతిభే కొలమానం అంటున్నారు.

గతంలో అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి.. వంటి వారిని మంత్రి పదవుల నుంచి తొలగించే క్రమంలో జగన్ పై కాస్త ఒత్తిడి వచ్చినా అందరికీ సర్దిచెప్పుకుంటూ వచ్చారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత విషయంలో ఇబ్బంది ఎదురైనా తర్వాత ఆమె సర్దుకున్నారు. ఇప్పుడు టీమ్-2 నుంచి కూడా కొన్ని వికెట్లు పడబోతున్నాయి. ముందుగా సీదిరి అప్పలరాజుపై వేటు ఖాయమైనట్టు తెలుస్తోంది. సీఎం జగన్ తో ఆయనకు సడన్ మీటింగ్ జరిగింది. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తనకేమీ ఇబ్బంది లేదని కూడా అప్పలరాజు చెప్పారు. అంటే ఆయన పదవీగండాన్ని ఊహించారు, పదవి లేకపోయినా సర్దుకుపోతానని చెప్పేశారు.

తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాంతో కూడా జగన్ ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. రెండు దఫాలు ఆయన మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. పదవి రాకపోయినా సర్దుకుపోయారు, స్పీకర్ పోస్ట్ లో ఉండి కూడా ప్రతిపక్షాన్ని చెడామడా వాయించేస్తున్నారు. ఆ అర్హతే ఆయనకు టీమ్-3లో బెర్త్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈసారి ఎమ్మెల్సీలలో కూడా కొంతమందికి జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. గతంలో మంత్రి పదవులు లేని సామాజిక వర్గాలను ఏరికోరి జగన్ కేబినెట్ లోకి తీసుకుంటారని అంటున్నారు. ఈనెల 3న జరిగే ఎమ్మెల్యేల మీటింగ్ లో దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

మొత్తమ్మీద ఐదేళ్ల పాలనలో మూడు కేబినెట్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. మంత్రి అంటే, ఐదేళ్లు ఏం చేసినా చెల్లుబాటవుతుంది అనుకునే ధీమాని పక్కనపెట్టేశారు జగన్. రెండేళ్లు గ్యారెంటీ ఆపైన బోనస్ అనుకునే విధంగా నాయకుల్ని మెంటల్ గా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మూడో టీమ్ ని రంగంలోకి దించబోతున్నారు. అయితే ఇందులో భారీగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. ఇద్దరు ముగ్గురి విషయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 

Tags:    
Advertisement

Similar News