జగన్ పర్యటనతో నెల్లూరు వైసీపీ నేతల్లో గుబులు..

ప్రతిపక్షమే లేని నెల్లూరు జిల్లాలో, వైసీపీ అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతుందనేమాట వాస్తవం. దీనిపై జగన్ దృష్టిపెట్టారని, ఈ పర్యటనలో నేతలకు క్లాస్ తీసుకుంటారనే వాదన వినపడుతోంది.

Advertisement
Update:2022-09-05 08:45 IST

ఏపీ సీఎం జగన్ ఈనెల 6న నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ లను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. నెల్లూరు జిల్లా సంగంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ని ప్రారంభించి అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు, ఆ తర్వాత నెల్లూరు నగరానికి వచ్చి నెల్లూరు బ్యారేజ్ ని ప్రారంభించి తిరుగు పయనమవుతారు. ఇదీ షెడ్యూల్. ఇక్కడ స్థానిక నాయకులతో సమావేశం అనేది షెడ్యూల్ లో లేకపోయినా.. నెల్లూరు వైసీపీ నాయకులు మాత్రం తెగ హడావిడి పడిపోతున్నారు.

గ్రూపు రాజకీయాలు..

నెల్లూరు జిల్లా వైసీపీలో గ్రూపు రాజకీయాలకు కొదవే లేదు. అనిల్ అంటే ఆనం ఫ్యామిలీకి పడదు, కాకాణి అంటే అనిల్ కి పడదు. మేకపాటి కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నా మాటల్లేవు. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకోసం కోవూరు సీటుకి ఎసరు పెట్టబోతున్నారనే భయం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిలో ఉంది. ఇలా.. దాదాపుగా జిల్లాలో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఈ దశలో జిల్లా పంచాయితీపై జగన్ దృష్టిపెట్టారని, ఈ పర్యటనలోనే క్లాస్ తీసుకుంటారేమోననే అనుమానాలున్నాయి.

బాబాయ్ వర్సెస్ అబ్బాయ్..

ఇటీవల నెల్లూరు జిల్లాలో మరో సరికొత్త రాజకీయం మొదలైంది. సిటీ వైసీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. సిటీ ఎమ్మెల్యే అనిల్ పార్టీ ఆఫీస్ రాజన్న భవన్ కి పోటీగా, సిటీ పరిధిలోనే నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ జగనన్న భవన్ కి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన తర్వాత రూప్ అనుచరుల్ని పోలీసులు స్టేషన్ కి పిలిపించడం, వెంటనే రూప్ వెళ్లి విడిపించుకోవడం, ప్రత్యర్థులపై విమర్శలు చేయడం.. ఇదంతా ఓ ఎపిసోడ్. అనిల్ కుమార్ కి రూప్ కుమార్ బాబాయి వరుస. గతంలో ఇద్దరూ కలిసే రాజకీయాలు చేశారు. కానీ అనిల్ కి మంత్రి పదవి వచ్చాక పొరపొచ్చాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం కూడా సీఎం వరకు వెళ్లింది. కానీ ఆల్టర్నేట్ లీడర్స్ ని అధిష్టానాలు డిస్కరేజ్ చేసిన ఘటనలు అరుదు. ఇక్కడ నెల్లూరులో కూడా అదే జరుగుతోంది. రూప్ కుమార్ కి అనిల్ వ్యతిరేక వర్గం మద్దతు పూర్తిగా ఉంది. అయితే నగరంలో పార్టీకి ఇది ప్రమాదకరం అనుకుంటే మాత్రం జగన్ కచ్చితంగా ఇక్కడే సెటిల్మెంట్ చేసి వెళ్లే అవకాశాలున్నాయి.

ప్రతిపక్షమే లేని నెల్లూరు జిల్లాలో, వైసీపీ అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతుందనేమాట వాస్తవం. దీనిపై జగన్ దృష్టిపెట్టారని, ఈ పర్యటనలో నేతలకు క్లాస్ తీసుకుంటారనే వాదన వినపడుతోంది. ఇప్పటికిప్పుడు జగన్ చూసీ చూడనట్టు వదిలేసినా, భవిష్యత్తులో నెల్లూరు పంచాయితీ జగన్ ని ఇబ్బంది పెట్టే అవకాశాలు మాత్రం ఉన్నాయని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News