నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ఏం చెప్పారంటే..?
గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై కేంద్రం చేస్తున్న ఖర్చుని అభినందించారు ఏపీ సీఎం జగన్.
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నోట్ సమర్పించారు. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, తద్వారా ఆర్థికవ్యవస్థ పురోగమిస్తుందని చెప్పారు. భారత ఉత్పత్తులు పోటీపడాలంటే రవాణా వ్యయం తగ్గాలని సూచించారు. ప్రస్తుతం మన దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉందని, ఇది జీడీపీలో దాదాపు 14శాతంగా ఉందన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందని చెప్పారు. అమెరికాలో లాజిస్టిక్స్ ఖర్చు అక్కడి జీడీపీలో కేవలం 7.5శాతానికే పరిమితం అని, భారత్ లో మాత్రం అంతకు రెట్టింపు ఉందన్నారు. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై కేంద్రం చేస్తున్న ఖర్చుని అభినందించారు జగన్.
ఏపీ అభివృద్ధి ఇలా..
నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధి గురించి వివరించారు సీఎం జగన్. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించిందని రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల ఏపీలో దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని వివరించారు.
ప్రజారోగ్యం, గ్రామ, వార్డ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గురించి నీతి ఆయోగ్ లో సమర్పించిన నోట్ లో ప్రస్తావించారు సీఎం జగన్. ఏపీలో పాఠ్యప్రణాళికను సమగ్రంగా మార్చి డైనమిక్ గా తయారు చేశామని నైపుణ్యాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని చెప్పారు జగన్.
కేంద్ర మంత్రులతో జగన్ భేటీ..
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలంటున్నాయి.