రెండువారాల్లో రెండోసారి ఢిల్లీకి జగన్.. ఏం జరుగుతోంది..?
వైరి వర్గాలు ఇవన్నీ రహస్య పర్యటనలని అంటున్నాయి. జగన్ పై నిందలు మోపుతున్నాయి. కేవలం రెండు వారాల గ్యాప్ లో జగన్ ఢిల్లీ వెళ్లడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది.
ఈనెల 17వ తేదీన ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా ని కలసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారాయన. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆయన ఢిల్లీకి వెళ్లడంతో టీడీపీ విమర్శలకు పదును పెట్టింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకోడానికే ఆయన ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో అసెంబ్లీలో ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. సభలో గొడవ చేసి సస్పెండ్ అయ్యారు.
కట్ చేస్తే రెండు వారాల గ్యాప్ లోనే మళ్లీ జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. పోనీ ఇప్పుడైనా ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారనే విషయం అధికారికంగా చెబుతున్నారా అంటే అదీ లేదు. ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడైనా జగన్ ప్రెస్ మీట్ పెడతారా అంటే అదీ లేదు. కానీ జగన్ ఢిల్లీ వెళ్తున్నారనే ప్రకటన మాత్రం విడుదలైంది. దీంతో మళ్లీ టీడీపీ లైన్లోకి వచ్చింది. వివేకా హత్య కేసు విషయంలో సీబీఐకి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమైందని, అందుకే జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శలు మొదలు పెట్టారు.
ఏది నిజం..?
జగన్ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన ఏమవుతుంది. పదే పదే వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం ఏమైనా కనపడుతుందా..? పోనీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ అసలేంజరిగిందనే విషయంపై కనీసం ప్రకటన కూడా చేయడంలేదు. దీంతో వైరి వర్గాలు ఇవన్నీ రహస్య పర్యటనలని అంటున్నాయి. జగన్ పై నిందలు మోపుతున్నాయి. కేవలం రెండు వారాల గ్యాప్ లో జగన్ ఢిల్లీ వెళ్లడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది.
ముందస్తుకి అనుమతికోసమా..?
ఏపీలో ముందస్తు ఊహాగానాలు వినపడుతున్నాయి. వరుసగా 4 ఎమ్మెల్సీలను టీడీపీ చేజిక్కించుకోవడంతో ఆ పార్టీలో హుషారు మొదలైంది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి చేరువవుతున్న పరిస్థితి. ఈ దశలో జగన్ ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం కూడా వినపడుతోంది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఏపీలో కూడా ఎన్నికలు జరిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ముందస్తుకు వెళ్లాలంటే అసెంబ్లీని రద్దు చేస్తే సరిపోతుంది, ప్రధాని మోదీ అనుమతి అవసరం లేదు. అయితే రాష్ట్రపతి పాలన పెట్టి మరికొన్నాళ్లు ఎన్నికలను పొడిగించకుండా ముందుగానే ప్రధానితో జగన్ ఈ విషయాన్ని చర్చించడానికి వెళ్తున్నారని అంటున్నారు. వీటిలో ఏది నిజమో, ఎంత నిజమో తేలాలంటే అధికారికంగా ఎవరైనా నోరు విప్పాలి. కానీ ఏపీలో అది అత్యాశే అనుకోవాలి.