అభివృద్ధి కార్యక్రమాలకు డెడ్ లైన్లు ప్రకటించిన ఏపీ సీఎం జగన్..

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలని ఆదేశించారు సీఎం జగన్.

Advertisement
Update:2022-08-23 19:49 IST

ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఆటంకం లేకుండా సాగిపోతున్నాయి. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇకపై అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరుగులు పెట్టించాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు ఏపీ సీఎం జగన్. స్పందన, విద్య, వైద్య రంగంలో నాడు-నేడు పనుల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ ల నిర్మాణం జరుగుతోంది. అయితే సకాలంలో కాంట్రాక్టర్లకు డబ్బులు జమకాక కొన్నిచోట్ల పనులు ఆగిపోయాయి. వాటన్నిటినీ అక్టోబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్. అవసరమైన నిధులు సమకూరుస్తామన్నారు. ఇక 3966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకి కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిని డిసెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు జగన్. అక్టోబరు-2 నాటికి గ్రామాల్లో జగనన్న భూహక్కు-భూరక్ష సర్వే పూర్తికావాలన్నారు. యజమానులకు భూ హక్కు పత్రాలు మంజూరు చేయాలని చెప్పారు.

స్పందన కీలకం..

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలని ఆదేశించారు సీఎం జగన్. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో స్పందన కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలన్నారు. ప్రతి గురువారం చీఫ్‌ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. స్పందన కార్యక్రమం కోసం ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

సచివాలయాల నిధులు సద్వినియోగం చేసుకోవాలి..

గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్తున్నారని, ఆయా సందర్భాల్లో ప్రజలనుంచి వచ్చిన వినతులను పరిష్కరించడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు కేటాయించామని చెప్పారు సీఎం జగన్. ప్రాధాన్యతా క్రమంలో ఆయా పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ఆ బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. పనులు మొదలు పెట్టడంలో ఉన్న వేగం, పూర్తి చేయడంలో కూడా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా ఉందని, వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరమైన వార్త అన్నారు. దేశ వృద్ధిరేటు కంటే ఏపీ సగటు వృద్ధిరేటు అధికంగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నానన్నారు. ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆగష్టు 25న నేతన్న నేస్తం, సెప్టెంబర్‌ 22న వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News