మేనిఫెస్టో లేకుండానే ముగిసిన సిద్ధం.. మరింత ఊరిస్తున్న ఏపీ సీఎం
మేనిఫెస్టో సిద్ధమైందా లేదా అనేదానిపై కీలక నేతలకు కూడా సమాచారం లేదు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చిన లీకులన్నీ ఊహాగానాలు మాత్రమే.
మేదరమెట్ల ఆఖరి సిద్ధం సభ అదిరిపోయే రేంజ్ లో జరిగిందని వైసీపీ నేతలంటున్నారు. సీఎం జగన్ స్పీచ్ కూడా మరింత పవర్ ఫుల్ గా ఉంది. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మేనిఫెస్టో మాత్రం విడుదల కాలేదు. సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదలవుతుందని విజయసాయిరెడ్డి వంటి నేతలు చెప్పడంతో అది ఖాయమే అనుకున్నారంతా, సభా వేదికనుంచే మంత్రి అంబటి రాంబాబు కూడా మేనిఫెస్టో కోసం వేచి చూస్తున్నామని చెప్పడంతో ఈసారి గ్యారెంటీ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం మేనిఫెస్టో విడుదల చేయలేదు. అమలు చేయదగ్గ హామీలతో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తామని మాత్రం జగన్ సభా వేదికనుంచి చెప్పడం గమనార్హం.
2019 మేనిఫెస్టోలో ఒకట్రెండు హామీలు మినహా మిగతావాటన్నిటినీ సీఎం జగన్ అమలు చేశారు. 99 శాతం హామీలు అమలు చేశామని వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు కూడా. 2024లో ఇచ్చే హామీలు 100 శాతం అమలు చేసేలా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచన. సంక్షేమ పథకాలు ఇప్పటికే సంతృప్త స్థాయిలో ఉన్నాయి కాబట్టి.. వాటిపై ఉదారంగా వెళ్లే అవకాశం లేదు. ఏ కొత్త పథకం తెచ్చినా కాపీ అనే పేరు లేకుండా చూసుకోవాలి. అందుకే మేనిఫెస్టోపై గతంలో ఎప్పుడూ లేనంతగా కసరత్తులు చేస్తున్నారు.
షెడ్యూల్ విడుదల తర్వాతే..!
వాస్తవానికి రాప్తాడు సభలోనే మేనిఫెస్టో బయటకొస్తుందని అనుకున్నారంతా. ఆ తర్వాత మేదరమెట్లలో జరిగే చివరి సిద్ధం సభలో గ్రాండ్ రిలీజ్ ఉంటుందనుకున్నారు. ఇక్కడ కూడా విడుదల కాలేదు. మేనిఫెస్టో సిద్ధమైందా లేదా అనేదానిపై కీలక నేతలకు కూడా సమాచారం లేదు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చిన లీకులన్నీ ఊహాగానాలు మాత్రమే. మేనిఫెస్టో గురించి ఇంతలా ఊరిస్తున్న సీఎం జగన్.. నవరత్నాలను మించేలా ఇంకేం రెడీ చేశారనేది తేలాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాతే వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లోకి వచ్చే అవకాశముంది.