ఆ 5 సంతకాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ని కూడా అధికారులు కేబినెట్ ముందుంచారు. జులై -1 నుంచి పోస్ట్ ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేస్తారు.
సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ తర్వాత ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదు ఫైళ్లకు సంబంధించిన నిర్ణయాలకు ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కొత్తగా టెట్ నిర్వహించాలా, లేక టెట్ లేకుండా నేరుగా డీఎస్సీ పరీక్ష పెట్టాలా అనే అంశాలపై చర్చించారు మంత్రులు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ని కూడా అధికారులు కేబినెట్ ముందుంచారు. జులై -1 నుంచి పోస్ట్ ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు.
ఇక ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్.. అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం సంతకం పెట్టినప్పుడే ఆయా అంశాలు ఆమోదం పొందినా, లాంఛనంగా ఈరోజు కేబినెట్ ఆ నిర్ణయాలను సమర్థిస్తూ తీర్మానం చేసింది. ఇక పెన్షన్ల పెంపు అంశానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇంటివద్దకే పెన్షన్..
పెన్షన్ల పెంపుపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. ఇప్పటి వరకు ఇస్తున్న రూ.3వేల ను రూ.4వేలకు పెంచుతోంది ప్రభుత్వం. జులై 1 నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీ మొదలవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి పెంచిన మొత్తం రూ.3వేలు, ఈనెల రూ.4వేలు.. మొత్తం జులై-1న రూ.7వేల పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులు పెరిగిన పెన్షన్ ను అందుకోబోతున్నారు. జులై-1న ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొచ్చి అందిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి. సచివాలయ సిబ్బంది మాత్రమే పెన్షన్లు ఇస్తారా..? రాజీనామా చేయకుండా విధుల్లోనే ఉన్న వాలంటీర్ల సేవలు కూడా ఉపయోగించుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది.