అసైన్డ్ భూముల రైతుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌

కేబినెట్ భేటీలో నిర్ణ‌యించిన ప్ర‌కారం.. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా అనుమ‌తి ల‌భించింది.

Advertisement
Update:2023-07-12 16:49 IST

అసైన్డ్ భూములు, లంక భూముల‌కు సంబంధించి పూర్తి హ‌క్కులు ల‌బ్ధిదారుల‌కే కేటాయించాల‌ని ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బుధ‌వారం సీఎం జగన్ అధ్యక్షతన జ‌రిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపారు. అదే విధంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడున్నర గంటల పాటు సాగిన భేటీలో 55 అంశాలపై చర్చించినట్టు స‌మాచారం.

కేబినెట్ భేటీలో నిర్ణ‌యించిన ప్ర‌కారం.. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా అనుమ‌తి ల‌భించింది. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. మొత్తం 63,19,184 ఎకరాల అసైన్డ్ భూములు, లంక భూముల విషయంలో 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒరిజినల్ అసైనీలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒరిజినల్ అసైనీలు కాలం చేస్తే.. వారి వారసులకు ఈ నిబంధన వర్తిస్తుంది.

మ‌రికొన్ని ముఖ్య‌ నిర్ణ‌యాలు..

- ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు నిర్ణయం. 1,966 రెవెన్యూ గ్రామాల్లో అమ‌లు చేయ‌నున్నారు.

- రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాల మాఫీ. తద్వారా పూర్తి హక్కుల కల్పన.

- అమరావతి సీఆర్డీఏ ప‌రిధిలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమ‌తి.

- యూనివ‌ర్సిటీల్లో శాశ్వ‌త అధ్యాప‌కుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 65 ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం.

- అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్టసవరణకు ఆమోదం.

- ప్రభుత్వ ఉద్యోగుల్లాగే దేవదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణ‌యం.

- కర్నూలులో కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు 247 పోస్టులు మంజూరుచేస్తూ కేబినెట్ నిర్ణయం

Tags:    
Advertisement

Similar News