విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో బీఆర్ఎస్ పోరుబాట

టీడీపీ, వైసీపీ.. కేంద్రంలోని బీజేపీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి జరగాలంటే ఏపీ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Update:2023-07-03 13:58 IST

విభజన హామీలు అమలు చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాలను ఇబ్బంది పెడుతోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. విభజించిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాకపోవడంతో ఆ హామీలకు తమకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తోంది బీజేపీ. ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర ఆర్థిక సాయంలో ఏమాత్రం పురోగతి కనపడటం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెడలు వంచుతామంటూ తొడలు కొడుతున్నాయే కానీ, హస్తినలో ప్రతాపం చూపించలేకపోతున్నాయి. ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ ఆ బాధ్యత భుజానికెత్తుకుంటానంటోంది. ఏపీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విభజన హామీల అమలుకోసం త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు నాయకులు నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్‌ కు ఇచ్చిన విభజన హామీల సాధన కోసం బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ నేతృత్వంలో త్వరలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. గుంటూరులోని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఈమేరకు తీర్మానించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన అనే అంశంపై బీఆర్ఎస్ నాయకులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, విభజన హామీల అమలుకోసం పోరాటం చేస్తామన్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.

టీడీపీ, వైసీపీ.. కేంద్రంలోని బీజేపీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. తెలంగాణ మోడల్‌ అభివృద్ధి జరగాలంటే ఏపీ ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. 

Tags:    
Advertisement

Similar News