ఉత్తరాంధ్రలో చావుదెబ్బ.. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు
బీజేపీలో పేరున్న నేతల్ని కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు, అదే సమయంలో తాము ఏ టీడీపీకి అయితే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారో, అదే టీడీపీ రాష్ట్రంలో బలపడుతోందనే సంకేతాలు మొదలయ్యాయి.
ఏపీలో వచ్చిన ప్రతి ఉప ఎన్నికలోనూ తానున్నానంటూ బరిలో దిగి పరువు పోగొట్టుకుంది బీజేపీ. అప్పట్లో తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో జనసేన తరపున అభ్యర్థిని నిలబెడతామంటూ పవన్ కల్యాణ్ పట్టుబట్టినా ససేమిరా అని చెప్పి చావుదెబ్బ తిన్నది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మిగిలిన పరువు కూడా పోగొట్టుకుంది. అన్నిచోట్లా పోటీ చేసినా.. కనీసం పోటీ ఇవ్వగలదు అనుకున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా బీజేపీ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఏపీలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలిపోయింది.
ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని, టీడీపీ లాంటి కుటుంబ పార్టీలతో తాము చేతులు కలపం అంటూ ఇటీవల బీజేపీ బాగానే డబ్బా కొట్టుకుంది. ఆ అత్యుత్సాహంతోటే జనసేన దూరంగా ఉంటున్నా కూడా పట్టించుకోవడంలేదు. ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఏపీ బీజేపీలో జోష్ వచ్చినట్టు చెప్పుకున్నారు. అదే ఉత్సాహంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ని బరిలో దింపారు. మిగతా చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులను నిలబెట్టినా.. ఉత్తరాంధ్రపై మాత్రం కాస్తో కూస్తో ఆశలు పెట్టుకుంది కాషాయదళం. కానీ అక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అక్కడ టీడీపీ విజేత కాగా, వైసీపీకి రెండో స్థానం, పీడీఎఫ్ కి మూడో స్థానం, బీజేపీకి నాలుగో స్థానం దక్కాయి.
బీజేపీలో పేరున్న నేతల్ని కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు, అదే సమయంలో తాము ఏ టీడీపీకి అయితే ప్రత్యామ్నాయం అనుకుంటున్నారో, అదే టీడీపీ రాష్ట్రంలో బలపడుతోందనే సంకేతాలు మొదలయ్యాయి. తమతో కలసి ఉన్న జనసేన టీడీపీకి దగ్గరవుతోంది. ఈ దశలో ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత షాకిచ్చాయి. అసలు ఏపీలో బీజేపీకి ఏ కోశానా ప్రజా బలం లేదని తేలిపోయింది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీనే ప్రజలు ఆదరిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అదే రుజువైంది.