ఏపీ రాజకీయాల్లో సినిమా సీన్లు.. వీర్రాజు సస్పెన్స్ డైలాగులు
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు. శుభాకాంక్షలు చెబుతూ జరిగే తొలి భేటీకి ఇంత ప్రాధాన్యత లేకపోయినా.. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ మాత్రం ఆసక్తిగా ఉంది.
ఏపీ రాజకీయాల్లో త్వరలో సినిమాలను మించిన సస్పెన్స్ సీన్లు మొదలవుతాయని చెప్పారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వీర్రాజు ఈ డైలాగులు చెప్పే సమయానికి హడావిడిగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు కావడం, అటు అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. ఇలా ఈ వ్యవహారం మరింత సస్పెన్స్ గా మారింది. ఇంతకీ ఏపీలో ఏం జరగబోతోంది..? ఊహలకు కూడా అందని ఆ సస్పెన్స్ సీన్లు ఏంటి..?
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు. శుభాకాంక్షలు చెబుతూ జరిగే తొలి భేటీకి ఇంత ప్రాధాన్యత లేకపోయినా.. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ మాత్రం ఆసక్తిగా ఉంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రి.. ఇలా సోమవారం అంతా ఢిల్లీలో ఫుల్ బిజీగా గడపబోతున్నారు సీఎం జగన్.
జగన్ పర్యటన పేరెత్తలేదు కానీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాత్రం సినిమాటిక్ డైలాగులతో సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, వీటిని ఎవ్వరూ ఊహించలేరని, ఊహించబోరని అన్నారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతోందని చెప్పారు. రాజకీయ పరిణామాలు ఈ విధంగా ఎలా జరిగాయోననే విషయం ఎవ్వరికీ అర్థం కాదని కూడా అన్నారు. త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటాయని ముక్తాయించారు.
ఎవ్వరికీ భయపడని జగన్ భయపడేది నరేంద్ర మోదీకేనని అంటున్నారు వీర్రాజు. వైసీపీని గద్దె దించే ఏకైక పార్టీ బీజేపీయేనని చెప్పారు. అంతర్వేది రథం దగ్ధమైన తర్వాత తమ పోరాటం వల్లే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు వీర్రాజు. అదే రీతిలో ఏపీలో ప్రాజెక్ట్ లకోసం రాయలసీమలో యాత్ర చేపడతామన్నారు. పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకుండా మొండికేసిన జగన్, బీజేపీ రంగంలోకి దిగగానే భయపడిపోయి రెండోకోటా ఇచ్చారని అన్నారు. ఇంతకీ వీర్రాజు చెప్పిన సినిమా సీన్లు ఏంటి..? జగన్ టూర్ ఎందుకంత హడావిడిగా ఖరారైంది, అమిత్ షా- ఎన్టీఆర్ భేటీ ఆంతర్యమేంటి..? ఇవన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్ మాత్రమే.