సీమకు వెళ్లి సోము వీర్రాజు కొత్త రాగం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రొద్దుటూరులో పర్యటించారు. రాయలసీమ బీజేపీ జోనల్ స్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement
Update:2022-09-15 11:15 IST

ఏపీ బీజేపీ నేతలు ఏ రోటికాడ ఆ రాగం ఆలపిస్తున్నారు.. అమరావతి వాదులతో కలిసినప్పుడు అన్నీ ఇక్కడే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు వెళ్లినప్పుడు విశాఖా మంచిదే అంటున్నారు. ఇక రాయలసీమకు వెళ్తే మాత్రం బహిరంగంగానే హైకోర్టు కర్నూలులోనే ఏర్పాటు చేయాలంటున్నారు.

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రొద్దుటూరులో పర్యటించారు. రాయలసీమ బీజేపీ జోనల్ స్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు. డిమాండ్ చేయడమే కాదు.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తనదని ప్రకటించారు.

టీడీపీ, వైసీపీ ఎంత సేపూ పోలవరం గురించి మాట్లాడుతున్నాయే గానీ రాయలసీమకు చెందిన హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని సోము ప్రశ్నించారు. కేవలం 500 కోట్ల రూపాయలతో సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే రాయలసీమకు నికర జలాలను సకాలంలో తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.

గతంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ డిక్లరేషన్ కూడా చేసింది. కానీ సీమ పర్యటనలకు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అమరావతి వాదులతో కలిసినప్పుడు మాత్రం వారు 29 గ్రామాల రాగమే ఆలపిస్తున్నారు. మరి పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు.. వారి వద్ద హైకోర్టు కర్నూలులోనే ఏర్పాటు చేయడం బీజేపీ ఆశయం అని చెప్పగలరా?.

Tags:    
Advertisement

Similar News