మా బటన్ జగన్ చేతుల్లో.. వీర్రాజు ఆక్రోశం..

కేంద్రం ఇస్తున్న నిధులను తమ సొంత ఖాతాల్లో నుంచి ఇచ్చినట్లు సంక్షేమ పథకాల పేరుతో పంచి పెడుతున్నారని అన్నారు సోము వీర్రాజు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను కేంద్రమే ఇచ్చిందని గుర్తు చేశారు.

Advertisement
Update:2022-08-16 18:52 IST

తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతి రోజూ తమ ఉనికిని చాటుకుంటుంటారు కానీ, ఏపీలో మాత్రం అడపా దడపా ఆవేశం వచ్చినప్పుడే మీడియా ముందుకొస్తుంటారు. ఇటీవల కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న ఏపీ బీజేపీ నేతలు మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యల తర్వాత బీజేపీ కూడా తమ ఉనికిని కాపాడుకోవ‌డానికి వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టింది. నిధులు కేంద్రానివి, అది నొక్కే బటన్ మాత్రం జగన్ దగ్గర ఉందని ఆక్రోశం వెలిబుచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

కోస్తా, ఆంధ్ర, గోదావరి జోన్ల బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తోలు మందం, బుర్రలేని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. నేచర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ళ పట్టాల పేరుతో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. బటన్ నొక్కడమే పనిగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని, అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. 35 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు రాష్ట్రం వాటిని పూర్తి చేయలేదని మండిపడ్డారు.

కేంద్రం ఇస్తున్న నిధులను తమ సొంత ఖాతాల్లో నుంచి ఇచ్చినట్లు సంక్షేమ పథకాల పేరుతో పంచి పెడుతున్నారని అన్నారు సోము వీర్రాజు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను కేంద్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రం రాజధాని కోసం నిధులిస్తే, ఏపీకి రాజధాని లేకుండా చేశారని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు తీసుకుని.. చివరకు ప్యాకేజీ వల్ల లాభం లేదని, నిధులే రాలేదని అంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ సభకు ఇద్దరు కేంద్ర మంత్రులు వస్తారని చెప్పారు సోము వీర్రాజు.

Tags:    
Advertisement

Similar News