అప్పుల వివరాలు అడిగిన బీజేపీ.. తప్పించుకునే ప్రయత్నమేనా..?

ఉన్నట్టుండి ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎందుకు బురదజల్లాలనుకుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement
Update:2024-05-31 18:51 IST

మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయనుకుంటున్న టైమ్ లో ఏపీ బీజేపీ నేతలు హడావిడిగా గవర్నర్ ని కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు కావాలంటూ వినతిపత్రం అందించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో 11మంది నేతలు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ ని కలసి మీడియా ముందుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

మొత్తం 13 అంశాలపై గవర్నర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు బీజేపీ నేతలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్‌బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తుల వివరాలు ప్రకటించాలని కోరినట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని, గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఆరోపించారు. గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శించారు. మద్యంపై భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని కూడా చూపించి అప్పులు చేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాన్ని వివరణ అడిగే హక్కు గవర్నర్‌కు ఉందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల వివరాలు కావాలని తాము కోరామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన బిల్లులు చెల్లించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు.

ఎందుకీ హడావిడి..?

ఉన్నట్టుండి ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎందుకు బురదజల్లాలనుకుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముందుగానే ప్రభుత్వంపై విమర్శలు చేసి, ఖజానా ఖాళీ చేశారనే నిందవేసి ఉంచితే.. భవిష్యత్తులో తమకి ఉపయోగం ఉంటుందేమోనని కూటమి భావిస్తోంది. అందుకే ముందుగా బీజేపీ నేతలు గవర్నర్ ని కలిశారు, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

Tags:    
Advertisement

Similar News