తూచ్.. విశాఖలో ఓడిపోయాం, అమరావతే రాజధాని

ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నానని గతంలో జగన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే జగన్ ఇప్పుడు అమరావతిని వదిలి విశాఖకు పారిపోతున్నారంటూ హాట్‌ కామెంట్లు చేశారు.

Advertisement
Update:2023-03-22 19:11 IST

విశాఖ రాజధాని అన్నాం కాబట్టి ఉత్తరాంధ్ర మద్దతు మొత్తం తమకే అనుకున్నవారందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. అంతమాత్రాన టీడీపీకి బలం పెరిగిపోయిందని చెప్పలేం కానీ.. రాజధాని అనే ప్రకటన ఉత్తరాంధ్ర వాసులకు పెద్దగా రుచించలేదు అనే విషయం బోధపడింది. అందుకే ఇప్పుడు బీజేపీ సడన్ గా అమరావతి రాగం ఎత్తుకుంది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అంటున్న సోము వీర్రాజు, అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని పునరుద్ఘాటించారు.

సడన్ గా ఎందుకు..?

ఇటీవల సీఎం జగన్ విశాఖ గురించి చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలో పాలనా రాజధాని విశాఖకు వెళ్లబోతున్నామంటూ బహిరంగంగానే ప్రకటించారు. మంత్రులను కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు. అప్పట్లో బీజేపీ నుంచి పెద్దగా ప్రతిఘటన లేదు, కానీ ఇప్పుడు సడన్ గా వీర్రాజు తెరపైకి వచ్చారు. అమరావతే రాజధాని అన్నారు. ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నానని గతంలో జగన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే జగన్ ఇప్పుడు అమరావతిని వదిలి విశాఖకు పారిపోతున్నారంటూ హాట్‌ కామెంట్లు చేశారు.

ఫ్లైఓవర్లు కూడా కట్టాం..

అమరావతి రాజధాని అనే ఉద్దేశంతోనే బెజవాడలో మూడు ఫ్లైఓవర్లు కట్టామని అంటున్నారు సోము వీర్రాజు. అమరావతే రాజధాని కాబట్టి.. ఇక్కడ అభివృద్దికి నిధులు కేటాయిస్తాం అన్నారు. విశాఖను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, కేంద్రం విశాఖకు లక్షకోట్లు ఇస్తే, జగన్ కనీసం 200 కోట్లు కూడా కేటాయించలేకపోయారని అన్నారు.

వీర్రాజు చెబితే సరిపోతుందా..?

అమరావతే రాజధాని అని వీర్రాజు చెబితే సరిపోతుందా..? అంతే ధైర్యంగా కేంద్రం ఒక్కసారికూడా అమరావతిపై ప్రకటన చేయలేకపోయింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని తేల్చేసింది. మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని పూర్తిగా మరచిపోయింది. రాజధాని విషయంలో పూటకోమాట మాట్లాడే బీజేపీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో తగిలిన ఎదురుదెబ్బతో మళ్లీ అమరావతిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది. 

Tags:    
Advertisement

Similar News