ఏపీ అసెంబ్లీలో రభస.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన టీడీపీ
తొలిరోజే అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి టీడీపీ నేతలు అడ్డు పడ్డారు. గవర్నర్ ప్రసంగం అంతా అసత్యాలతో నిండిపోయిందని, భరించలేకపోతున్నామని అన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఆసాంతం ప్రభుత్వ విజయాలతో నిండిపోయింది. గవర్నర్ గా ఆయనకు ఇదే తొలి ప్రసంగం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న అబ్దుల్ నజీర్ పదవీ విరమణ అనంతరం తొలిసారిగా ఏపీకి గవర్నర్ గా నియమితులయ్యారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందుతోందని, వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలవుతోందని తెలిపారు.
ఇంటి వద్దకే పథకాలు..
అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు గవర్నర్. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రం అనూహ్య ప్రగతి సాధిస్తోందని చెప్పారు. 11.43 శాతం గ్రోత్ రేటుతో ఏపీ ఆర్థికాభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు గవర్నర్ నజీర్. మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు మొదలయ్యాయని, రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం అందుతోందన్నారు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నారని, ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే పంపిస్తున్నారని చెప్పారు. 2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పూర్తయిందని తెలిపారు. నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్ బీమా కింద అందిన సాయాన్ని ప్రస్తావించారు.
సభలో రభస..
తొలిరోజే అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి టీడీపీ నేతలు అడ్డు పడ్డారు. గవర్నర్ ప్రసంగం అంతా అసత్యాలతో నిండిపోయిందని, భరించలేకపోతున్నామని అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే పలుమార్లు టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు.