టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వ్యాఖ్యలు

సభలో కొందరు అనుచితమైన పదాలు వాడడం పైన స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం పుస్తకాలు చదివితే గొప్ప గొప్ప పదాలు ఎలా వాడొచ్చో సభ్యులు తెలుసుకోవచ్చని సూచించారు.

Advertisement
Update:2022-07-16 07:38 IST

చట్టసభల్లో సభ్యుల ప్రవర్తనపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన స్పీకర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని తాను గతంలో కూడా గట్టిగా చెప్పానని ఆయన వివరించారు. కానీ ఎందుకో ఎక్కడో మౌనం కొనసాగుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందేనని అందుకు పరిష్కారం కనుగొనాల్సిందేనని వ్యాఖ్యానించారు .

తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించగా.. వారు ఇంకా తెలుగుదేశం పార్టీ సభ్యులు గానే చెప్పుకుంటున్నారని, ఆ పార్టీకి రాజీనామా చేయలేదని, కాబట్టి తానేలా చర్యలు తీసుకోగలనని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. అసెంబ్లీలో తీరు "నువ్వు ఒక అందుకు పోస్తున్నావు.. నేను ఒకందుకు తాగుతున్న" అన్నట్టుగా తయారైందని ఇది నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ సభను నడపాలి కాబట్టి తాను నడుపుతున్నాని చెప్పారు.

చట్టసభల్లో ప్రమాణాలు పడిపోవడానికి తాను ఏ ఒక్క పార్టీలో ఏ ఒక్క వ్యక్తినో నింధించబోనని స్పీకర్ వ్యాఖ్యానించారు. నిజంగా ప్రజల కోసమే అయితే సభలో బూతులు తిట్టుకోవడం అవసరమా అని కూడా ఆయన ప్రశ్నించారు. చట్టసభల్లో, చట్టసభ ప్రాంగణాల్లో ఆందోళనలు చేయడం ధర్నాలు నిర్వహించడం, సభలో ప్లకార్లు ప్రదర్శించడం వంటివి సరైన చర్యలు కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. నిరసన తెలియజేయాలంటే అందుకు అనేక మార్గాలు ఉన్నాయని ఇలా ప్రవర్తించడం సరైనది కాదన్నారు.

శాసనసభ్యులు ఏమి చిన్న పిల్లలు కాదని, వాళ్లు నియమావళి పాటించాల్సి ఉంటుందని, అలాంటి వారే తప్పుడు మాటలు మాట్లాడితే తాను స్పీకర్ గా వారించగలను గానీ, ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించగలను గానీ, అంతకుమించి ఏమీ చేయలేను అని కూడా తమ్మినేని సీతారాం చెప్పారు.

సభలో కొందరు అనుచితమైన పదాలు వాడడం పైన స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం పుస్తకాలు చదివితే గొప్ప గొప్ప పదాలు ఎలా వాడొచ్చో సభ్యులు తెలుసుకోవచ్చని సూచించారు. లైవ్ కారణంగా సభ్యులు మాట్లాడుతున్న పదాలు టీవీల్లో వెంటనే ప్రజల్లోకి వెళ్లిపోతున్నాయని తమ్మినేని విశ్లేషించారు. అసమ్మతిని తెలిపే హక్కు నిరసన తెలిపే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుందని కానీ ఆ వ్యక్తీకరణ చట్టాలకు లోబడి రాజ్యాంగబద్ధంగా ఉండాలని, హక్కుల స్వేచ్ఛ అరాచకత్వానికి పునాదికారాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News