గవర్నర్ ను జగన్ అవమానించారా..? ఇవిగో సాక్ష్యాలు
గవర్నర్ కు వైసీపీ ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని అన్నారు మంత్రి బుగ్గన. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల.. టీడీపీ నేతలు అమర్యాదగా ప్రవరిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ కి స్వాగతం పలికే విషయంలో సీఎం జగన్ అవమానకర రీతిలో ప్రవర్తించారని, గవర్నర్ ని వైసీపీ నేతలు అవమానించారని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అవాస్తవాలు అంటున్నారు వైసీపీ నేతలు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన టీడీపీ, టీడీపీ అనుకూల మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కు సీఎం స్వాగతం పలకలేదనేది తప్పుడు ప్రచారం అని చెప్పిన బుగ్గన.. స్వాగతం పలికే వీడియోలను విడుదల చేశారు. వీడియో సాక్ష్యాలు చూసిన తర్వాతయినా టీడీపీ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
అది సభా హక్కుల ఉల్లంఘనే..
గవర్నర్ కు వైసీపీ ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని అన్నారు మంత్రి బుగ్గన. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల.. టీడీపీ నేతలు అమర్యాదగా ప్రవరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి బుగ్గన. టీడీపీ వ్యవహారశైలి ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలన్నారు. టీడీపీ, టీడీపీ అనుకూల మీడియాపై చర్యలకు సిఫార్సు చేయాలని స్పీకర్ ని కోరారు బుగ్గన.