కుప్పం వైసీపీలో చీమచిటుక్కుమన్నా పెద్ద వార్తే..

కుప్పం మండలం వానగట్టపల్లె అనే గ్రామంలో జల్లిజట్టు నిర్వహించే విషయంలో సర్పంచ్‌ వర్గానికి, ఎంపీటీసీ వర్గానికి మధ్య విబేధాలు వచ్చాయి.

Advertisement
Update:2023-09-04 10:57 IST

ఈ మధ్య కుప్పం న్యూస్‌ ప్రయారిటీ బాగా పెరిగిపోయింది. కుప్పం టీడీపీలో చీమచిటుక్కుమన్నా వైసీపీ మీడియాలో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. వైసీపీలో అలాంటి పరిణామాలు జ‌రిగినా టీడీపీ మీడియా బాగా హైలైట్‌ చేస్తోంది. కుప్పం నియోజకవర్గంలోని ఒక గ్రామంలో వైసీపీ విబేధాలకు టీడీపీ అనుకూల పత్రికల్లో ఇవ్వాల్సిన దానికి మించి ప్రాధాన్యత ఇచ్చారు.

కుప్పం మండలం వానగట్టపల్లె అనే గ్రామంలో జల్లిజట్టు నిర్వహించే విషయంలో సర్పంచ్‌ వర్గానికి, ఎంపీటీసీ వర్గానికి మధ్య విబేధాలు వచ్చాయి. జల్లికట్టు వల్ల గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని, ప్రశాంతత దెబ్బతింటోందని, కాబట్టి జల్లికట్టు వద్దంటూ సర్పంచ్‌ వర్గీయులు పోలీసులను కోరారు. తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ జోక్యం చేసుకుని ఇరువర్గాలను ఒప్పించి జల్లికట్టు నిర్వాహణను ఓకే చేశారు.

అంతలోనే మళ్లీ జల్లికట్టు నిర్వాహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్సీ భరత్‌.. గ్రామ సర్పంచ్‌ తన సొంత సామాజికవర్గం వారే కావడంతో వారి మాటకే విలువ ఇచ్చి లోలోన జల్లికట్టు నిర్వాహణను అడ్డుకున్నారని ఎంపీటీసీ వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో చాలా చోట్ల జల్లికట్టు, ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నా అడ్డుపడని వారు తమ గ్రామంలో మాత్రమే ఎందుకు జరగనివ్వడం లేదని ఎంపీటీసీ మంగమ్మ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ తీరును నిరసిస్తూ ఎంపీటీసీ వర్గీయులు గ్రామ సచివాలయానికి తాళాలు వేశారు. కుప్పం- తిరుపత్తూరు రహదారిపై ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ భరత్ చాలా గ్రామాల్లో తన సామాజికవర్గం వారిని ప్రోత్సహిస్తూ తొలినుంచి వైసీపీలో ఉన్న వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీ ఆరోపిస్తున్నారు. భరత్‌ తీరు మారకపోతే తాము వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

*

Tags:    
Advertisement

Similar News