ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి.. - వేధింపులు తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య
మా బిడ్డ భయపడుతున్నాడని అనుకున్నాం గానీ.. ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదు.. అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శనివారం రాత్రి రైలు కింద పడి చనిపోయాడని తెలిశాక మా గుండెలు పగిలిపోయాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ర్యాగింగ్ భూతం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కాలేజీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మృతుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. అనంతసాగరం మండలం శంకరనగరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ టి.పెంచలయ్య, లక్ష్మీకుమారిల కుమారుడు ప్రదీప్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
విద్యార్థినుల ఫోన్ నంబర్ల కోసం వేధింపులు..
సీనియర్లు నిత్యం ర్యాగింగ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ప్రదీప్ తమతో చెప్పి ఆందోళనకు గురయ్యేవాడని తల్లిదండ్రులు వెల్లడించారు. తమ కుమారుడి తరగతిలోని విద్యార్థినుల ఫోన్ నంబర్లు ఇవ్వాలని వేధించేవారని చెప్పారు. సీనియర్లతో పాటు బయటి వారు కూడా ఈ వేధింపులకు పాల్పడేవారని వివరించారు. బీర్లు, బిర్యానీ కావాలని డిమాండ్ చేసేవారని, డబ్బులు లేవంటే సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ దౌర్జన్యం చేసేవారని చెప్పారు.
ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదు..
దీంతో తాము కళాశాలకు వచ్చి మాట్లాడతామని చెబితే.. వేధింపులు ఇంకా ఎక్కువవుతాయని, వద్దని చెప్పాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇక లాభం లేదని టీసీ ఇచ్చేయాలని, వేరేచోటికి వెళ్లి చదువుకుంటాడని అడిగినా యాజమాన్యం పట్టించుకోలేదని ప్రదీప్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధ్యాపకులను కలిసి సమస్య వివరించిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని వారం రోజుల కిందట తమకు చెప్పాడని వివరించారు. ఎవరో చెప్పమంటే వద్దన్నాడని, హాస్టల్ నుంచి బయటికెళితే ఊరుకోబోమని, పరీక్షలు రాయనీయబోమని భయపెట్టారని ఆందోళనకు గురయ్యాడని తెలిపారు. తమను కూడా చంపేస్తామన్నారని వివరించాడు.
మా బిడ్డ భయపడుతున్నాడని అనుకున్నాం గానీ.. ప్రాణాలు తీసుకుంటాడనుకోలేదు.. అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శనివారం రాత్రి రైలు కింద పడి చనిపోయాడని తెలిశాక మా గుండెలు పగిలిపోయాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కోణం నేపథ్యంలో ఈ కేసును బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని కావలి రైల్వేస్టేషన్ ఎస్ఐ అరుణకుమారి వెల్లడించారు.