ఎన్టీఆర్ విషయంలో సీఎం జగన్ మరో స్కెచ్.?

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించబోతోందనే వార్తలు వస్తున్నాయి. ముందుగా కేబినెట్‌లో ఈ అంశంపై ఆమోదముద్ర వేయించుకొని, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2022-09-29 07:00 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహాలు, ఆలోచనలు ఎవరికీ అంత త్వరగా అర్థం కావు. ఒకవైపు సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటూనే.. మరోవైపు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే అనేక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కోసారి జగన్ తీసుకునే నిర్ణయాలు సన్నిహితులకు, పార్టీ పెద్దలకు కూడా అంత త్వరగా అర్థం కావు. టీడీపీ, చంద్రబాబును ఇరుకున పెట్టడానికి ఎన్నో సార్లు అసెంబ్లీ వేదికగానే 'వెన్నుపోటు' అంశాన్ని ఉటంకిస్తుంటారు. ఇటీవల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సమయంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. దీంతో సీఎం జగన్ గ్రాఫ్ ఓ వర్గంలో అమాంతంగా పెరిగిపోయింది. 14 ఏళ్లు సీఎంగా ఉన్న అల్లుడు చంద్రబాబు కూడా ఏనాడూ ఎన్టీఆర్‌కు ఇలాంటి గౌరవాన్ని ఇవ్వలేదనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే వైఎస్ జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. దీంతో ఒక్కసారిగా అందరికీ షాక్ తగిలింది.

అసెంబ్లీలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జగన్ వివరణ కూడా ఇచ్చారు. అయినా సరే కమ్మ వర్గంలో మాత్రం తీవ్రమైన చర్చకు దారి తీసింది. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ఒక్క ముక్క మాట్లాడని టీడీపీ శ్రేణులు, ఆయన కుటుంబీకులు.. హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని చెప్పి.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. యార్లగడ్డ కూడా పదవికి రాజీనామా అని చెప్పి.. ఆ తర్వాత మాట మార్చారు. ఇకపై ఎన్టీఆర్ విషయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పుకొచ్చారు. అసలు కేవలం వారం రోజుల్లోనే హెల్త్ వర్సిటీ పేరు మార్పిడిపై టీడీపీ బ్యాచ్ సైలెంట్ ఎందుకయ్యిందనేది ఎవరికీ అర్థం కాలేదు.

ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని భవిష్యత్ పరిణామాలు కూడా ఆలోచిస్తారనే పేరున్న వైఎస్ జగన్.. హెల్త్ వర్సిటీ విషయంలో తప్పటడుగు వేశారని చాలా మంది అనుకున్నారు. సొంత పార్టీలోనే ఉన్న కమ్మ వర్గంలో కూడా ఈ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జగన్‌పై అభిమానంతో వాళ్లందరూ పైకి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఇందులో జగన్ ముందస్తు వ్యూహం మరొకటి ఉందని మాత్రం తెలుసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబును ఇరుకున పెట్టడానికి ఎప్పుడూ ఎన్టీఆర్ పేరును జగన్ తీసుకొస్తుంటారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల తప్పకుండా వ్యతిరేకత వస్తుందని వైఎస్ జగన్‌కు కూడా తెలుసు. కానీ అంతకంటే మరింత గౌరవాన్ని ఎన్టీఆర్‌కు ఇవ్వాలనేదే జగన్ స్కెచ్ అనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించబోతోందనే వార్తలు వస్తున్నాయి. ముందుగా కేబినెట్‌లో ఈ అంశంపై ఆమోదముద్ర వేయించుకొని, ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే విషయం ఎప్పటి నుంచో ఉన్న డిమాండే. అయితే చంద్రబాబే ఈ నిర్ణయానికి అడ్డుతగులుతున్నారని గతంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాదే చెప్పారు. ఎన్టీఆర్‌తో పాటు సి. నారాయణరెడ్డికి భారతరత్న ఇవ్వాలని కోరగా.. చంద్రబాబు వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే ఆ అవార్డును స్వీకరించడానికి భార్యగా లక్ష్మీపార్వతి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు మొదటి నుంచి ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్ ఆ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలని అనుకుంటున్నారు.

ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, జగన్ అడిగే ఈ కోరికను మోడీ కాదనరు అని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చింది తామే అని బీజేపీ కూడా ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. ఇవ్వాళ ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి తీసేసినందుకు తిట్టన నోర్లే రేపు పొగుడుతాయని కూడా వైఎస్ జగన్ అంచనా వేసుకున్నారు. ఎటు చూసినా ఇది వైసీపీకి లాభమే తప్ప నష్టం లేదు. అదే సమయంలో చంద్రబాబును పూర్తిగా కార్నర్ చేసినట్లు కూడా ఉంటుంది. ఇదే జగన్ వేసిన మాస్టర్ స్కెచ్ అని.. కాకపోతే ఇది అర్థం చేసుకోలేక టీడీపీ ఆయన ట్రాప్‌లో పడిందని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News