అన్న క్యాంటీన్ల కోసం విరాళాల సేకరణ..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలని కోరారు, కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.

Advertisement
Update:2024-07-10 07:12 IST

అన్న క్యాంటీన్ల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్న క్యాంటీన్ల పేరుతో త్వరలో ట్రస్ట్‌ ప్రారంభించబోతున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత వరకు దాతలపై భారం వేసి, మిగతావాటికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలుస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వ పాలన చివరి రోజుల్లో అన్న క్యాంటీన్లంటూ హడావిడి చేశారు. 2019లో ప్రభుత్వం మారాక క్యాంటీన్లు మూతపడ్డాయి. పేదల నోటి దగ్గర కూడు తీసేశారంటూ టీడీపీ రచ్చ చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచాక మళ్లీ ఆ క్యాంటీన్లు తెరుచుకుంటున్నాయి. గతంలో ఉన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నారు. ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టుకుని క్యాంటీన్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా క్యాంటీన్లు అందుబాటులోకి రావడం విశేషం. అయితే ఈ సారి పూర్తిగా ప్రభుత్వంపై భారం పడకుండా.. దాతల సాయంతో అన్న క్యాంటీన్లు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. విరాళాల సేకరణ మొదలు పెట్టారు.

తొలి దశలో మొత్తం 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి పునరుద్ధరణకు రూ. 20కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. క్యాంటీన్లలో ఐవోటీ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ కోసం రూ.7 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 20 చోట్ల కొత్త క్యాంటీన్లు నిర్మించబోతున్నారు. కొత్త క్యాంటీన్లతోపాటు పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకోసం మరో రూ.65 కోట్లను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేసి ఆగస్ట్ 15న లాంఛనంగా కొన్ని క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలని కోరారు, కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.

Tags:    
Advertisement

Similar News