నెల్లూరులో సరికొత్త పొలిటికల్ గేమ్.. ఆనంతో అనిల్ భేటీ..!

నెల్లూరు జిల్లాలో 10 కి 10 అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకున్నా కూడా ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. మంత్రి పదవుల విషయంలో జిల్లాలో గ్రూపులు ఏర్పడ్డాయి. 2024 టికెట్ల విషయంలో కూడా ఒకరికొకరు గోతులు తవ్వుకోవాలనుకుంటున్నారు.

Advertisement
Update:2023-01-06 14:35 IST

ఒకే పార్టీలో ఉన్నా నెల్లూరులో ఆనం కుటుంబానికి, మాజీ మంత్రి అనిల్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆమధ్య కాకాణి మంత్రి అయిన తర్వాత ఫ్లెక్సీల చించివేతతో ఆనం వర్సెస్ అనిల్ గ్రూపు తగాదాలు మరింత రచ్చకెక్కాయి. వైసీపీ పక్కనపెట్టడంతో 2024లో ఆనం రామనారాయణ రెడ్డి అనివార్యంగా పార్టీ మారాల్సిన పరిస్థితి. వెంకటగిరి నుంచి ఆయన నెల్లూరు సిటీ లేదా రూరల్ నియోజకవర్గానికి వచ్చేస్తారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ దశలో అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడైన విజయ కుమార్ రెడ్డితో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఇది పూర్తిగా పర్సనల్ మీటింగ్ అయినా అక్కడ చర్చకు వచ్చిన విషయాలు మాత్రం నెల్లూరులో పొలిటికల్ హీట్ పెంచాయి.

టార్గెట్ నెల్లూరు రూరల్..

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనం విజయ కుమార్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా పనిచేశారు, ప్రస్తుతం ఆయన భార్య నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. రూరల్ లో ఆనం కుటుంబానికి, ముఖ్యంగా విజయ్ కుమార్ రెడ్డికి మంచి అనుచరగణం ఉంది. శ్రీధర్ రెడ్డికి, విజయ్ కుమార్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలను అనిల్ కుమార్ యాదవ్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారనేది ఇక్కడ హాట్ టాపిక్. అనిల్, శ్రీధర్ రెడ్డి మధ్య కూడా సత్సంబంధాలు లేవు. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ని శ్రీధర్ రెడ్డి వర్గం దగ్గరకు తీస్తోందనే విషయంలో అనిల్ రగిలిపోతున్నారు.

అన్నతో విభేదించు.. టికెట్ ఇప్పిస్తా..!

ఆనం రామనారాయణ రెడ్డిని ఇటీవల పార్టీ పక్కనపెట్టిన సంగతి, ఆయన పార్టీని వీడి బయటకు వెళ్తారనే సంగతి కూడా తెలిసిందే. అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంకా వైసీపీలోనే ఉన్నారు. రామనారాయణ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి, జగన్ పై ఉన్న విధేయతను చాటుకోవాలని విజయ్ కుమార్ రెడ్డికి అనిల్ సలహా ఇచ్చినట్టు సమాచారం. అలా చేస్తే.. నెల్లూరు రూరల్ టికెట్ విజయ్ కుమార్ రెడ్డికి వచ్చే విధంగా తాను సహకరిస్తానని, శ్రీధర్ రెడ్డిని దెబ్బకొట్టినట్టవుతుందని కూడా అనిల్ భరోసా ఇచ్చారట. ఒకవేళ నెల్లూరు రూరల్ టికెట్ తనకి వచ్చినా, విజయ్ కుమార్ రెడ్డి సహకరించేలా ఒప్పందం చేసుకోవాలనుకున్నారట అనిల్. అయితే ఈ ప్రతిపాదనకు విజయ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

నెల్లూరు జిల్లాలో 10 కి 10 అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకున్నా కూడా ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. మంత్రి పదవుల విషయంలో జిల్లాలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. 2024 టికెట్ల విషయంలో కూడా ఒకరికొకరు గోతులు తవ్వుకోవాలనుకుంటున్నారు. ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరిది పైచేయి అవుతుందో, అసలు జగన్ మనసులో ఏముందో ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News