మహిళల కోసం 'అమ్మ పార్టీ'
చట్టసభల్లోకి రాకుండా అడ్డుకుంటున్న రిజర్వేషన్ బిల్లు మాకవసరం లేదు. మాకు ఐదూళ్లు కాదు అర్ధరాజ్యం కావాలని నినదిస్తున్నారు. 'రిజర్వేషన్ కోసం పోరాడం, ఓపెన్‌లోనే బరిలో దిగుతాం, చట్టసభలో అడుగు పెడతాం' అంటున్నారు.
మన ప్రజాస్వామ్యంలో ఏడాదికేడాదికీ అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కాలక్రమంలో కొన్ని నిలదొక్కుకుంటున్నాయి, కొన్ని తప్పటడుగులతో పడుతూ లేస్తూ నడక సాగిస్తున్నాయి. మరికొన్ని అంతర్థానమై పోతున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మగవాళ్లు స్థాపించిన పార్టీలే. అయితే.. మనదేశ రాజకీయ యవనిక మీద మహిళలు నడిపిస్తున్న పార్టీలు ఉన్నాయి. మహిళలు స్థాపించిన పార్టీలూ ఉన్నాయి. అయితే మహిళల కోసం మహిళలు స్థాపించిన పార్టీల కోసం మాత్రం దుర్భిణీ వేసి వెతకాల్సిందే. ఒక ప్రయత్నంగా ఐదేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్వేతాశెట్టి 'నేషనల్ ఉమెన్స్ పార్టీ' ని స్థాపించారు. 'పార్టీ ఆఫ్ మదర్స్' ట్యాగ్‌లైన్‌తో మహిళల కోసం పని చేసే పార్టీగా ప్రజల ముందుకు వచ్చారు. రాజస్థాన్ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను నిలిపిందా పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు అలాంటి మరో ప్రయత్నానికి మరింత పటిష్టంగా సమాయత్తమవుతున్నారు. 'అమ్మ పార్టీ' పేరుతో ప్రజల ముందుకు రావడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ వంటి వ్యవహారాలు వేగంగా ముందుకు సాగిపోతున్నాయి.
పితృస్వామ్య ప్రజాస్వామ్యం!
'మన ప్రజాస్వామ్యం ఈ 75 ఏళ్లలో తన స్వరూపాన్ని పితృస్వామ్య ప్రజాస్వామ్యంగా మార్చుకున్నది. వారసత్వ రాజకీయాలకు వేదికగా మారింది. పితృస్వామ్య సమాజంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం మహిళలకు ఇవ్వాల్సిన అవకాశాలను న్యాయంగానే కల్పించింది. మహిళల సాధికారత కోసం వెసులుబాటు కల్పించింది. అయితే సాధికారత సాధన కోసం మహిళలను ముందుకు అడుగువేయనివ్వని విధంగా ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేశారు మన పాలకులు. అందాల్సిన ఫలాలు మహిళలు అందుకునే అవకాశం లేని ప్రజాస్వామ్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంతో మహిళల కోసం మహిళలే ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే మహిళల్లో తమ కోసం తాము పోరాడవచ్చనే ఆలోచన కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందడుగు వేస్తున్నారు.
ఐదూళ్లు కాదు.. అర్ధరాజ్యం!
మహిళలకు స్థానిక సంస్థల్లో మూడవ వంతు భాగస్వామ్యం ఇచ్చి 'మీ కోసం మేమెంత చేశామో చూడండి' అని మహిళల చప్పట్ల కోసం, మహిళల ఓట్ల కోసం ఎదురు చూసే నాయకులను ఆదరించే రోజులు పోయాయి. చట్టసభల్లోకి రాకుండా అడ్డుకుంటున్న రిజర్వేషన్ బిల్లు మాకవసరం లేదు. మాకు ఐదూళ్లు కాదు అర్ధరాజ్యం కావాలని నినదిస్తున్నారు. 'రిజర్వేషన్ కోసం పోరాడం, ఓపెన్‌లోనే బరిలో దిగుతాం, చట్టసభలో అడుగు పెడతాం' అంటున్నారు. ఈ పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వాల కమిటీలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం లేదా పై వారం ప్రకటన వెలువడ వచ్చు.