వైసీపీలోకి కోడెల శివరాం రాకపై అంబటి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో ఒక్క వైఎస్‌ను మాత్రమే నమ్ముకున్నానని.. ఆ తర్వాత జగన్‌తో మాత్రమే ఉన్నానన్నారు. చంద్రబాబు ఆదరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు.

Advertisement
Update:2023-06-02 15:57 IST
వైసీపీలోకి కోడెల శివరాం రాకపై అంబటి వ్యాఖ్యలు
  • whatsapp icon

కోడెల శివప్రసాద్‌ రావు ఆ రోజు కాదు సత్తెనపల్లి టీడీపీ ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించిన మొన్నటి రోజు చనిపోయారని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ను తాను తరచూ విమర్శిస్తుంటానని.. అది కూడా ఎలాంటి బూతులు తిట్టకుండా సంస్కారవంతంగానే విమర్శిస్తుంటానని.. అయినా సరే తనను ఓడించేందుకు టీడీపీ చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నించడం అన్నది సహజమే అయినా తన విషయంలో మాత్రం మరీ ఎక్కువగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ ప్రయత్నాల వెనుక ఇంకా ఏయే కారణాలు ఉన్నాయి అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. తాను కూడా మరింత రిచార్జ్‌ అయ్యి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌లో జీడిపప్పు, పిస్తాలు తిని కండలు పెంచి, బీజేపీలోకి వెళ్లి పెద్ద వస్తాదుగా మారిన కన్నా లక్ష్మీనారాయణను తనపై దింపుతున్నారన్నారు. తాను, కన్నా లక్ష్మీనారాయణ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని.. ఆయన సక్సెస్ రేటు అధికమేనన్నారు. తన సక్సెస్ రేటు తక్కువగానే ఉందన్నారు. అయినా సరే తానెప్పుడు పదవుల కోసం పార్టీలు మారలేదన్నారు.

కాంగ్రెస్‌లో ఒక్క వైఎస్‌ను మాత్రమే నమ్ముకున్నానని.. ఆ తర్వాత జగన్‌తో మాత్రమే ఉన్నానన్నారు. చంద్రబాబు ఆదరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు కన్నాను తీసుకొచ్చి సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించడంతో కోడెల ఆత్మ కూడా చనిపోయిందన్నారు. కోడెల శివరాంను వైసీపీలోకి తీసుకుంటారా అన్నది ఊహాజనితమైన ప్రశ్న అని.. అన్నింటిని కాలమే నిర్ణయిస్తుందన్నారు అంబటి రాంబాబు.

Tags:    
Advertisement

Similar News