'బ్రో', నిన్నొదల.. పవన్ ని వెంటాడుతున్న అంబటి
తాజాగా అంబటి రాంబాబు మరోసారి ట్వీట్లు మొదలు పెట్టారు. ఈసారి పవన్ తోపాటు, నిర్మాతపై కూడా కామెంట్లు పెట్టారు.
ఆమధ్య వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కానీ 'బ్రో' సినిమా రిలీజ్ తర్వాత వైసీపీ, జనసేన మధ్య టాపిక్ కేవలం 'శ్యాంబాబు' మాత్రమే అయింది. మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ ని కామెంట్ చేస్తూ 'బ్రో'సినిమాలో చిన్న సీన్ ఇరికించడం, దాంతో మంత్రి ఫీలవ్వడం.. ట్వీట్లు, ప్రెస్ మీట్ల యుద్ధం తెలిసిందే. తాజాగా అంబటి రాంబాబు మరోసారి ట్వీట్లు మొదలు పెట్టారు. ఈసారి పవన్ తోపాటు, నిర్మాతపై కూడా కామెంట్లు పెట్టారు.
ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు !
ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !!
అంటూ ట్వీట్ పేసిన అంబటి, పవన్ కల్యాణ్ తోపాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేరు కూడా అందులో ప్రస్తావించారు. ఇటీవల బ్రో సినిమా కలెక్షన్ల గురించి అధికారిక లెక్కలు బయటకొచ్చిన తర్వాత టైమ్ చూసుకుని అంబటి ఈ ట్వీట్ వేయడం విశేషం.
అంబటిపై సెటైర్లు..
మంత్రి అంబటి రాంబాబు, తన శాఖాపరమైన విషయాలపై ఎప్పుడూ ఇంత ఆసక్తిగా ట్వీట్లు వేయలేదని.. పవన్ ని విమర్శించే క్రమంలో ఆయన తన స్థాయి మరచిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఓ సినిమాలో చిన్న సీన్ పై మంత్రిగా ఉన్న అంబటి ఇంత రచ్చ చేస్తున్నారెందుకంటూ ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. పవన్ కల్యాణ్ పై సినిమా తీసేందుకు సీఎం జగన్ ఏకంగా రామ్ గోపాల్ వర్మని ఇంటికి పిలిపించుకుని మరీ మంతనాలు జరిపారు కదా అని లాజిక్ తీస్తున్నారు. మీరేమో సినిమాలే తీయొచ్చు, మా హీరో సినిమాలో చిన్న సీన్ పెడితే మాత్రం తప్పా అంటున్నారు. మొత్తమ్మీద 'బ్రో' వ్యవహారంతో శ్యాంబాబు పాత్ర హైలెట్ కాగా, ఆ క్యారెక్టర్లో నటించిన పృధ్వి.. మరోసారి పాపులర్ అయ్యారు.