సీఎం కాదు కదా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు

చంద్రబాబు ఒక మేనిప్లేటర్ అని, ఆయన ఎప్పటికీ ప్రజా నాయకుడు కాలేరని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు.

Advertisement
Update:2024-04-11 19:43 IST

చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కాదు కదా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని జోస్యం చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. జరుగుతున్న సర్వేలు, వస్తున్న రిపోర్టులన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు అంబటి. చంద్రబాబు ఒక మేనిప్లేటర్ అని, ఆయన ఎప్పటికీ ప్రజా నాయకుడు కాలేరని ఎద్దేవా చేశారు.

చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏ పేదవాడి గుండెను తట్టిచూసినా జగనే ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పారు. పల్నాడు జిల్లాలో జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు అంబటి. కులం, మతం, ప్రాంతం, పార్టీ సంబంధం లేకుండా తాము అందరికీ అన్ని పథకాలు అందించామని, అదే ఇప్పుడు తమ పార్టీకి బలంగా మారిందని చెప్పారు. అన్ని వర్గాల వారు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారని అన్నారు అంబటి.

వాలంటీర్లపై నీఛమైన ఆరోపణలు చేసి, ఇప్పుడు నాలుక మడతేశారంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారు.. ఈరోజు రూ.10వేలు జీతం ఇస్తామనటం ఎన్నికల స్టంట్ కాదా అని ప్రశ్నించారు. ఈ మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అసలు చంద్రబాబు మాటలు భారత దేశంలో ఎవరైనా నమ్ముతారా అని అన్నారు అంబటి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేందుకు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయించింది చంద్రబాబేనన్నారు. తీవ్ర వ్యతిరేకత వచ్చే సరికి వారి జీతాల పెంపు గురించి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా అవన్నీ మోసపు మాటలుగానే ప్రజలు పరిగణిస్తారని చెప్పారు అంబటి. 

Tags:    
Advertisement

Similar News