పవన్ ఎంటర్టైనర్ మాత్రమే ఎడ్యుకేటర్ కాదు -అంబటి
పవన్ కల్యాణ్ పిరికివాడంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసకారి అని, పవన్.. మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరని తేల్చేశారు అంబటి.
వారాహి పూజలతో రాజకీయ వేడి పుట్టించిన పవన్ కల్యాణ్, ఏపీలో రాక్షస పాలన అతం చేస్తామంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో సహజంగానే వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు మరోసారి పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఆయన ఎడ్యుకేటర్ కాదని, కేవలం ఎంటర్టైనర్ మాత్రమేనన్నారు. పవన్ కల్యాణ్ నాయకుడు కాదని, ఎంటర్టైనింగ్ పీస్ మాత్రమేనని దెప్పిపొడిచారు .
మోసం, మోచేతి నీళ్లు..
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలసి వచ్చినా.. విడివిడిగా వచ్చినా 2024 ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. పవన్ కల్యాణ్ పిరికివాడంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసకారి అని, పవన్.. మోచేతి నీళ్లు తాగే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. వీరిద్దరికీ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయరని తేల్చేశారు. 16 నెలలు జైల్లో పెట్టినా జగన్ ఎవరికీ భయపడలేదన్నారు. ఎవరి అండ లేకుండా సింగిల్ గా ప్రజల మనసు గెలిచిన ధీరుడు జగన్ అని అన్నారు అంబటి.
వారాహి కాళ్లకింద పడి నలిగిపోతారు..
పవిత్రమైన వారాహి దేవత పేరు పెట్టుకుని చిందులు వేస్తే, పిచ్చి మాటలు మాట్లాడితే ఆ దేవత కాళ్ళ కింద పడి నలిగి పోవడం ఖాయం అన్నారు మంత్రి అంబటి రాంబాబు. వారాహి పేరుతో జరుగుతున్నదంతా హడావిడి మాత్రమేనని, ఆ వాహనంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయలేరని, అసలాయన ఎక్కడ పోటీ చేస్తారో ఆయనకే క్లారిటీ లేదని, జనసేన నేతలు ఎన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తారో కూడా ఎవరికీ తెలియదన్నారు. లోకేష్ పాదయాత్రపై కూడా అంబటి సెటైర్లు పేల్చారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలని లోకేష్ పాదయాత్ర చేస్తున్నారో అతనికే తెలియదన్నారు.