రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు..

రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.

Advertisement
Update:2024-08-18 19:41 IST

రామోజీ కుటుంబం శిక్ష అనుభవించక తప్పదని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ పై రామోజీ తప్పుడు వార్తలు రాశారని, ఉదయం లేచిన దగ్గర్నుంచి వైసీపీ పై దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ అని, మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో చేసిన కార్యక్రమాలన్నీ చట్ట వ్యతిరేకమేనని చెప్పారు. మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి.


ఈనాడు తమని ఇబ్బంది పెడుతుందని వైసీపీ నేతలు చెబుతున్నా.. మార్గదర్శి అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా కోర్టుకి సమర్పించి న్యాయపోరాటం చేస్తున్న ఘనత మాత్రం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి దక్కుతుంది. ఆ న్యాయపోరాటాన్ని సమర్థంగా కొనసాగించడంలో వైసీపీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేసినా శిక్షలు వేయించలేకపోయారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అందులోనూ మార్గదర్శి, ఈనాడుకి అధికార టీడీపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు, మార్గదర్శి బండారాన్ని వైసీపీ బయటపెట్టగలదో లేదో చూడాలి.

తాజాగా మార్గదర్శి కేసు వ్యవహారం మరోసారి ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. డిపాజిట్ల సేకరణ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) యాక్ట్‌ తమకు వర్తించదని మార్గదర్శి గతంలో తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసింది. ఈ క్వాష్‌ పిటిషన్‌కు ఆర్బీఐ తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిపాజిట్లు సేకరించడంపై విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్‌లో ఆర్బీఐ స్పష్టం చేసింది. మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్‌-45 వర్తిస్తుందని రిజర్వ్‌ బ్యాంకు తన కౌంటర్‌లో హైకోర్టుకు తెలిపింది. దీంతో మరోసారి ఈనాడు గ్రూప్ ఇరుకున పడింది. ఆర్బీఐ ఇంత స్పష్టంగా చెబుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం మార్గదర్శికి వంతపాడేలా ప్రవర్తిస్తోందని అంబటి రాంబాబు అంటున్నారు. రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రామోజీరావు చనిపోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. 

Tags:    
Advertisement

Similar News