విశాఖకు రానున్న అమెజాన్.. 2023 నుంచి కార్యకలాపాలు
వైజాగ్‌లో ప్రాథమికంగా ఏర్పాటు చేయనున్న డెవలప్‌మెంట్ సెంటర్‌లో 120 మందికి ఉద్యోగాల ఇవ్వనున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీలోని అతిపెద్ద నగరం విశాఖపట్నానికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్, ఈ-కామర్స్ కంపెనీ వైజాగ్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. 2023లో వైజాగ్‌లో అమెజాన్ కార్యాలయం ఏర్పాటు కానున్నది. ఇది సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా పని చేయనున్నట్లు అమెజాన్ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని ఇప్పటికే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) వెల్లడించింది.
వైజాగ్‌లో ప్రాథమికంగా ఏర్పాటు చేయనున్న డెవలప్‌మెంట్ సెంటర్‌లో 120 మందికి ఉద్యోగాల ఇవ్వనున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాబోయే మూడేళ్లలో వైజాగ్ కేంద్రంగా రూ.184 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు బుధవారం ఎస్టీపీఐ డీజీ అరవింద్ కుమార్‌ను కలిశారు. త్వరలో జరుగనున్న ఇన్ఫినిటీ వైజాగ్ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఆ సమయంలోనే అమెజాన్ త్వరలో విశాఖ కేంద్రంగా కార్యాలయం తెరవనున్న విషయాన్ని దృవీకరించారు.
వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ నగరానికి రానన్ని పెట్టుబడులు విశాఖకు వస్తున్నాయి. అమెజాన్ వంటి టాప్ కంపెనీలు కూడా వైజాగ్ వైపు చూస్తున్నాయి. రాబోయే రోజుల్లో వైజాగ్ మరో ఐటీ హబ్‌గా మారడం ఖాయమని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అంటున్నారు. ఇదే వైజాగ్ అభివృద్ధికి సరైన సమయం అని ఆయన చెబుతున్నారు. ఐటీ సెక్టార్‌లో వైజాగ్ డెవలప్ కావడానికి మరిన్ని అడుగులు పడాల్సిన అవసరం ఉందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు.
దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లోకి ప్రవేశించడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటిలో అమెజాన్ కూడా ఒకటి. ఖర్చులు తక్కువగా ఉండటం, స్కిల్ ఉన్న యువత దొరకడం వంటి కారణాలతో వైజాగ్ వంటి నగరాల్లో తమ డెవలప్‌మెంట్ సెంటర్లను అవి ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే విప్రో, టెక్ మహీంద్ర, ఫ్లుయంట్ గ్రిడ్, సెయింట్, డబ్ల్యూఎన్ఎస్ వంటి సంస్థలు వైజాగ్‌పై దృష్టి పెట్టాయి.