చీరాల-పర్చూరులలో ఆమంచి సోదరుల పాలి`ట్రిక్స్`
అకస్మాత్తుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఆమంచి స్వాములు ఉన్న ప్లెక్సీలు చీరాల ప్రధాన రహదారులపై వెలిశాయి.
ఆమంచి సోదరులు రాజకీయం మొదలు పెట్టారు. తమ కనుసన్నల్లోంచి చీరాల రాజకీయం జారిపోకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. చీరాల వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి త్యాగం చేసిన ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వెళ్లారు. అయినా సరే చీరాలని వదులుకునేందుకు ఆమంచి సోదరులు సిద్ధంగా లేరు. ఏ పార్టీలో ఉన్నా అధికారం చెలాయించేది ఆమంచి కృష్ణమోహన్ అయితే, తెరవెనుక వ్యవహారాలన్నీ నడిపించేది అన్న ఆమంచి స్వాములు. ఇప్పుడు వైసీపీలో కృష్ణమోహన్-జనసేనలో స్వాములు చేరి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
అకస్మాత్తుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఆమంచి స్వాములు ఉన్న ప్లెక్సీలు చీరాల ప్రధాన రహదారులపై వెలిశాయి. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ప్లెక్సీలపై ఎవరూ స్పందించకపోయినా ఆమంచి స్టైల్ రాజకీయం తెలిసిన నేతలు మాత్రం సోదరులిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగుతారని విశ్లేషిస్తున్నారు. చీరాల వైసీపీ టికెట్ తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్‌కి వస్తుందని, పర్చూరు వైసీపీ సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అవుదామని అన్న ఆమంచి స్వాములు కలలుగన్నారు. ఆమంచి సోదరులు అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి. చీరాల వైసీపీ ఇన్‌చార్జిగా కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ కన్‌ఫాం కావడంతో ఆమంచి కృష్ణమోహన్ బలవంతంగా పర్చూరు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తన సీటుకి ఎసరు వచ్చిందని స్వాములు కినుక వహించారని టాక్ వినపడుతోంది.
కరణం కుటుంబానికి చెక్ పెట్టాలంటే, రెండు నియోజకవర్గాల్లోనూ తాము ఉండాల్సిందేనని ఆమంచి సోదరులు భావిస్తున్నారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా అయిష్టంగా బాధ్యతలు తీసుకున్నా.. ఎన్నికల సమయానికి చీరాల జనసేన సీటుపై ఖర్చీఫ్ వేస్తారని, అన్నని పర్చూరు జనసేన అభ్యర్థిగా దింపుతారనే ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో జనసేనానితో ఆమంచి స్వాములు ఉన్న ఫ్లెక్సీలు కూడా రోడ్ల వెంబడి పెట్టడంతో చీరాల-పర్చూరు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.