మొదటి నెలలోనే 30 వేల పెన్షన్లకు కొర్రీ.. - ఆందోళనకు గురవుతున్న లబ్ధిదారులు

సాయం అందాల్సిన 60,129 మందిలో 30–40 శాతం వరకు మృతులు ఉండగా.. మిగిలిన వారిలో జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువుల ఇళ్లకు వెళ్లినవారు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారే అధిక శాతం మంది ఉన్నారు.

Advertisement
Update:2024-07-07 10:52 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తొలి మాసంలోనే పింఛన్ల పంపిణీలో కొర్రీలు పెట్టింది. జూలై నెల పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందలేదు. పింఛన్ల పంపిణీకి లాగిన్‌ గడువు గత వైసీపీ ప్రభుత్వం 5 రోజుల వరకు ఉంచగా, ప్రస్తుత ప్రభుత్వం దానిని 2 రోజులకు కుదించేసింది. దీంతో దూరప్రాంతంలో ఉన్నవారు రెండురోజుల తర్వాత రాగా వారికి పింఛన్లు అందలేదు. మరికొందరికి టీడీపీ నేతలు అడ్డుపడటంతో పింఛన్ల పంపిణీని అధికారులు నిలిపివేశారు.

లాగిన్‌ గడువు తగ్గించడంతో ఇబ్బంది...

సాయం అందాల్సిన 60,129 మందిలో 30–40 శాతం వరకు మృతులు ఉండగా.. మిగిలిన వారిలో జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు, బంధువుల ఇళ్లకు వెళ్లినవారు, అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారే అధిక శాతం మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పింఛన్లను పంపిణీ చేసేందుకు సచివాలయ ఉద్యోగులకు లాగిన్‌ గడువు ఉండటంతో మూడు, నాలుగు తేదీల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు వచ్చి పింఛన్‌ తీసుకుని వెళ్లేవారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పింఛన్‌ తీసుకునేందుకు రాలేని వారి వద్దకు వలంటీర్లు వెళ్లి అందించేవారు.

వచ్చేనెలలో అందజేతపై కొరవడిన స్పష్టత..

ప్రస్తుతం లాగిన్‌ గడువు రెండు రోజులకు పరిమితం చేయడంతో స్థానికంగా అందుబాటులో ఉన్నవారికి మాత్రమే ఎక్కువ శాతం పెన్ష‌న్లు అందాయి. గత ప్రభుత్వంలో నిర్ణీత ఐదో తేదీ దాటిన తర్వాత మిగిలిన మొత్తాన్ని జమచేసేవారు. కానీ, ఈసారి మూడో తేదీనే రూ.40.67 కోట్ల మేర మిగిలిన సొమ్మును సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి జమచేసేశారు. గతంలో మాదిరి ఐదో తేదీ వరకు గడువు ఉంటుందని రూ.7000 పింఛన్‌ తీసుకునేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వచ్చిన లబ్ధిదారులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వచ్చే నెలలో ఈ సాయాన్ని కలిపి అందిస్తారా లేదా? అన్నదానిపై తమకు స్పష్టత లేదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు.

పింఛన్ల పంపిణీలోనూ కక్షసాధింపులు...

మరోపక్క టీడీపీ నేతలు పింఛన్ల పంపిణీ విషయంలోనూ కక్షసాధింపులకు తెగబడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులైనవారికి పింఛను అందకుండా ఫిర్యాదులు చేయడం గమనార్హం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆయా ఫిర్యాదులపై విచారణ చేయకుండానే అధికారులు ఆ పింఛన్ల పంపిణీని నిలిపివేయడం గమనార్హం. అలాగే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలోని 40 మందికి పైగా అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. దీంతో లబ్ధిదారులు తమకు ఎందుకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ ఈ నెల మూడున బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ పింఛన్లు పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు అడ్డుపడటమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అందుకే తామేమీ చేయలేకపోతున్నామని వారు నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో బాధితులు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టును ఆశ్రయించారు.

Advertisement

Similar News