అఖిల ప్రియ ఓవర్ యాక్షన్.. అరెస్ట్ చేసిన పోలీసులు
సీఎం జగన్ సభలో గొడవ చేయడం అఖిల ప్రియ వ్యూహం. అందుకే ఆమె మందీ మార్బలంతో బయలుదేరారు. రైతుల తరపున వినతిపత్రం అంటూ ఎత్తుగడ వేశారు.
ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ.. సీఎం జగన్ పర్యటనలో రచ్చ చేసేందుకు ప్రయత్నించారు. ఓ దశలో వైసీపీ శ్రేణులు ఆమెను అడ్డుకుని వెనక్కి పంపించి వేయగా, మరోసారి ఆమె జగన్ సభ వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. జగన్ సభ వద్ద గొడవ చేయాలని, టీడీపీ శ్రేణుల్ని వెంట తీసుకెళ్లిన ఆమె చివరకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా అంటూ ఎల్లో మీడియా మళ్లీ రాద్ధాంతం చేయడం విశేషం.
ఆళ్లగడ్డలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర ఉంటుందని తెలిసిన వెంటనే ఆయనకు వినతిపత్రం ఇస్తామని అఖిల ప్రియ ప్రకటించారు. అయితే ఇన్నాళ్లూ సీఎం జగన్ ని కలసి వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించని అఖిలప్రియ.. సరిగ్గా ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు కలవాలనుకోవడం విశేషం. ఇది పొలిటికల్ గేమ్ అని, జగన్ ని కలిసేందుకు వెళ్లి అక్కడ గొడవ చేయడమే అఖిల ప్రియ ఉద్దేశమని అందరికీ తెలుసు. ఆళ్లగడ్డలో రైతులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తుండగా అఖిల ప్రియ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంట పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వచ్చారు. దీంతో మధ్యలోనే వైసీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. జగన్ సభ వైపు వెళ్లేందుకు దూసుకెళ్లారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.
సీఎం జగన్ సభలో గొడవ చేయడం అఖిల ప్రియ వ్యూహం. అందుకే ఆమె మందీ మార్బలంతో బయలుదేరారు. రైతుల తరపున వినతిపత్రం అంటూ ఎత్తుగడ వేశారు. ఎన్నికల కోడ్ వచ్చాక సీఎంకు వినతిపత్రాలు ఇవ్వడంలో ఆంతర్యమేంటో అఖిలప్రియ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. అందులోనూ టీడీపీ అభ్యర్థి అయిన ఆమె.. సీఎం జగన్ ని కలవాలనుకోవడమేంటని నిలదీస్తున్నారు. మళ్లీ జగనే సీఎం అవుతారని అఖిలప్రియకు నమ్మకం కుదిరినట్టుందని, అందుకే ఆమె వినతిపత్రం ఇవ్వడానికి వచ్చి ఉంటారని సెటైర్లు పేలుస్తున్నారు.