పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నేటి తరానికి తెలియజేయడమే లక్ష్యం.. కాలినడక దీక్ష చేపట్టిన సాయిచంద్
గురువారం చెన్నై నగరంలోని మైలాపూర్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం భవనం వద్ద ఆయన విగ్రహానికి సాయిచంద్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కాలినడక దీక్ష చేపట్టారు.
1980లో వచ్చిన మాభూమి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు నటుడు సాయిచంద్. ఆ సినిమా తర్వాత సాయిచంద్ మంచు పల్లకి, పెళ్లీడు పిల్లలు, ఈ చరిత్ర ఏ సిరాతో, రంగుల కల, శివ తదితర సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన సాయిచంద్ ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.
సుదీర్ఘ విరామం తర్వాత ఫిదా సినిమాతో మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సాయిచంద్ ఆ తర్వాత సైరా, ఉప్పెన, కొండపొలం, విరాటపర్వం తదితర సినిమాల్లో నటించాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఉద్యమం, నిరాహార దీక్ష, ప్రాణత్యాగం నేటి తరానికి తెలియజేయాలన్న లక్ష్యంతో సాయిచంద్ కాలినడక దీక్ష చేపట్టారు.
గురువారం చెన్నై నగరంలోని మైలాపూర్ లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం భవనం వద్ద ఆయన విగ్రహానికి సాయిచంద్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కాలినడక దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సాయిచంద్ మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన చేసిన ప్రాణత్యాగం ప్రస్తుత తరానికి తెలియజేసేందుకే కాలినడక దీక్ష చేపట్టినట్లు తెలిపారు. కాగా సాయిచంద్ చేపట్టిన కాలినడక దీక్ష చెన్నై నుంచి ప్రారంభమై పొట్టి శ్రీరాములు స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పడమటి పల్లె వరకు కొనసాగనుంది. కాలినడక దీక్షలో భాగంగా దారి పొడవునా సాయిచంద్ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.