అలీ కల నెరవేరింది.. ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి

అలీకి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారని చర్చ జరిగినా.. ఆయనకు కీలకమైన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు.

Advertisement
Update:2022-10-27 19:12 IST

సినీ నటుడు అలీకి ఏపీలో కీలక పదవి వరించింది. గత కొన్నేళ్లుగా వైసీపీకి అభిమానిగా, క్యాంపెయినర్‌గా ఉన్న అలీకి సీఎం వైఎస్ జగన్ ఎట్టకేలకు ఓ పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో అలీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అయితే జీతభత్యాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించి విడిగా ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రస్తుతం ఏపీలోని సలహాదారులకు కనీసం నెలకు రూ. 3 లక్షల వరకు జీతభత్యాలు అందుతున్నాయి. అలీకి కూడా అవే వర్తించనున్నట్లు తెలుస్తున్నది.

సినీ నటుడు అలీ మొదటి నుంచి పవన్ కల్యాణ్ బెస్ట్ ఫ్రెండ్‌గా ముద్రపడ్డారు. అయితే పవన్ జనసేన పార్టీ ఏర్పాటు చేసినా.. అలీ మాత్రం వైసీపీలోనే కొనసాగారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సార్లు తాడేపల్లి వెళ్లి కలిసి వచ్చారు. అలీ వెళ్లిన ప్రతీ సారి ఏదో ఒక పదవి వరిస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య రాజ్యసభ సీటు కూడా జగన్ ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, అలీకి ఇంత వరకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇటీవల నటుడు అలీ దంపతులు స్వయంగా వైఎస్ జగన్‌ను కలిశారు. దీంతో ఆయనకు ఏదో ఒక పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు.




వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇస్తారని చర్చ జరిగినా.. ఆయనకు కీలకమైన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు. నటుడిగా అందరికీ పరిచయం ఉండటంతో పాటు, మీడియా యాజమాన్యాలతో అలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తున్నది. సీఎం జగన్ వెంట నడిచిన పృథ్వికి టీటీడీ పదవి కట్టబెట్టినా నిలుపుకోలేక పోయారు. తాజాగా అలీకి సలహాదారు పదవి ఇచ్చారు. ఇక పోసానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఏ పదవి ఇవ్వని నటుడిగా మిగిలిపోయారు. రాబోయే రోజుల్లో పోసానికి కూడా మంచి పదవిని ఇస్తారనే చర్చ జరుగుతున్నది.

Tags:    
Advertisement

Similar News