బాబుపై కేసు రాజకీయ కక్ష కాదు .. - సుప్రీంకోర్టే ఆ విషయం చెప్పింది

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో జరిగిన అక్రమాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుగా బయటపెట్టాయని పొన్నవోలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగానే దానిపై విచారణ చేసిందని ఆయన వివరించారు.

Advertisement
Update:2024-01-18 07:19 IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసు రాజకీయ కక్షతో పెట్టింది కాదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టే ఆ విషయం చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నెల్లూరులో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలకు ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు తెలియాలని పొన్నవోలు చెప్పారు. ప్రభుత్వం తరపున కోర్టులో తాను వాదనలు వినిపించానని ఆయన గుర్తుచేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వ్యవహారంలో చంద్రబాబు నిబంధనలు పాటించలేదని, ఆ విషయం జీవో నంబర్‌–4లో స్పష్టం చెప్పడం జరిగిందని తెలిపారు. జీవో ప్రకారం జరగడం లేదని అప్పటి అధికారులు చెప్పినా అప్పటి ప్రభుత్వ పెద్దలు వినలేదన్నారు. అప్పట్లో ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు పట్టించుకోకుండా తాను అనుకున్నట్టే చేశారని చెప్పారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో జరిగిన అక్రమాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుగా బయటపెట్టాయని పొన్నవోలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగానే దానిపై విచారణ చేసిందని ఆయన వివరించారు. ప్రజాధనాన్ని కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారని, స్కిల్‌ స్కామ్‌ పేరుతో రూ.371 కోట్లు కాజేశారని ఆయన తెలిపారు. స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు దొరికిపోయిన దొంగ అని ఆయన చెప్పారు.

రాజకీయ కక్ష అనే మంత్రజాలంతో పాపాన్ని కడిగేసుకోవాలని టీడీపీ నేతలు, ఆ వర్గం మీడియా విశ్వ ప్రయత్నం చేశారని పొన్నవోలు తెలిపారు. చంద్రబాబు వయసుకు గౌరవమిచ్చి.. జైలులో సకల సౌకర్యాలనూ ప్రస్తుత ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. జైలు మాన్యువల్‌లో లేనివి కూడా చంద్రబాబుకు జైలులో అందించిన విషయాన్ని గుర్తుచేశారు. జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కూడా కల్పించిన విషయాన్ని వివరించారు. చంద్రబాబుకు అన్ని సదుపాయాలు కల్పించినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ఈ కేసులో తాను గల్లీ నుంచి వెళ్లి కమిట్‌మెంట్‌తో వాదించానని, కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారని ఆయన గుర్తుచేశారు.

Tags:    
Advertisement

Similar News