నెల్లూరులో ప్రైవేట్ స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి..

స్కూల్ యాజమాన్యం నిందితుడికి వత్తాసు పలకడంతో అక్కడే ఆందోళన చేపట్టారు. పీఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ దశలో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ పై దాడికి సిద్ధమయ్యారు.

Advertisement
Update:2022-11-12 15:47 IST

ఇటీవల హైదరాబాద్ లోని డీఏవీ స్కూల్ లో ఎల్.కె.జి. విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సరిగ్గా అలాంటి ఘటనే నెల్లూరులో జరిగింది. అక్కడ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడితే, ఇక్కడ స్కూల్ పీఆర్వోగా పనిచేసే వ్యక్తి 9ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు డైకస్ రోడ్ లోని ఒవెల్-14 స్కూల్ లో ఈ దుర్ఘ‌ట‌న జరిగింది.

బాధిత విద్యార్థిని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడటం చూసిన తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్కూల్ పీఆర్వో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లికి చెప్పింది ఆ విద్యార్థిని. తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం నిందితుడికి వత్తాసు పలకడంతో అక్కడే ఆందోళన చేపట్టారు. పీఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ దశలో స్కూల్ పై వారు దాడికి కూడా సిద్ధమయ్యారు. అంతలోనే పోలీసులు పీఆర్వో బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు.

పోక్సో చట్టంకింద కేసు నమోదు..

స్కూల్ పీఆర్వో బ్రహ్మయ్యపై పోలీసులు పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు. స్కూల్ విద్యార్థినిపై అదే స్కూల్ లో లైంగిక దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. అందరికీ డీఏవీ స్కూల్ ఘటనే కళ్లముందు మెదిలింది. నాన్ టీచింగ్ స్టాఫ్ ని తరగతి గదుల్లోకి అనుమతించడం ఇక్కడ యాజమాన్యాలు చేస్తున్న పెద్ద తప్పు. హైదరాబాద్ లో డీఏవీ స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కి అన్ని బాధ్యతలు అప్పగించడంతో అతడు మానవ మృగంలా మారాడు. ఇక్కడ నెల్లూరులో స్కూల్ పీఆర్వో తరగతి గదుల్లోకి వెళ్లడం, పిల్లల్ని ఏదో ఒక వంకతో వేరే రూమ్ లోకి తీసుకెళ్లడం, లైంగికంగా వేధించడం సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News