టీడీపీ-జనసేన పొత్తుపై ఎట్టకేలకు సమన్వయ కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో అభ్యర్థులు ఎంపిక, సీట్ల పంపకం నుంచి క్షేత్రస్థాయిలో తమ క్యాడర్ దిశానిర్దేశం వరకూ అన్నింటినీ ఈ యాక్షన్ కమిటీనే పర్యవేక్షిస్తుంది.
ఏపీలో టీడీపీ - జనసేన పొత్తుపై ఎట్టకేలకు మళ్లీ కదలిక వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జైలుకు వెళ్లి మరీ పరామర్శించిన పవన్ కళ్యాణ్.. పొత్తుపై జైలు ముంగిటే ప్రకటన చేశారు. కానీ.. ఆ తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోగా.. టీడీపీ నిరసనల్లో నిమగ్నమైంది. దాంతో పొత్తుపై సందేహాలు వస్తున్న వేళ.. ఎట్టకేలకు టీడీపీ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
టీడీపీ కమిటీలో ఆ ఐదుగురికి చోటు
టీడీపీ కమిటీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్యకి చోటు దక్కింది. అనుభవం, దూకుడు స్వభావం తక్కువ ఉన్న వారు కమిటీలో ఉంటే.. ఇబ్బందులు రావనే ఉద్దేశంతో చంద్రబాబు సూచన మేరకు ఈ ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గత వారం చివర్లో చంద్రబాబుని ములాఖత్‌లో కలిసిన నారా లోకేష్‌కి ఈ మేరకు పేర్లని బాబు సూచించినట్లు తెలుస్తోంది.
నాదెండ్ల మనోహర్‌ని నమ్ముకున్న జనసేన
జనసేన నుంచి కూడా సమన్వయ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. కానీ.. ఈ కమిటీలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కూడా ఈ కమిటీలో నామమాత్రమే. అంతా నాదెండ్ల మనోహర్ చూసుకుంటారని ఇప్పటికే టీడీపీకి ఆయన సూచించినట్లు తెలుస్తోంది. కానీ.. ఎన్టీఆర్- నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్‌ని దృష్టిలో పెట్టుకుని మనోహర్‌ని మరీ అతిగా నమ్ముకోవడం మంచిది కాదని పవన్ కళ్యాణ్‌కి మొదటి నుంచి హెచ్చరికలు వస్తున్న విషయం తెలిసిందే.
టీడీపీ - జనసేన కమిటీలు ఏం చేస్తాయ్..?
టీడీపీ- జనసేన కమిటీలు చర్చించుకుని ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడతాయి. ఇక అక్కడి నుంచి పొత్తులు కార్యరూపం దాల్చుతాయి. రాష్ట్రంలో అభ్యర్థులు ఎంపిక, సీట్ల పంపకం నుంచి క్షేత్రస్థాయిలో తమ క్యాడర్ దిశానిర్దేశం వరకూ అన్నింటినీ ఈ యాక్షన్ కమిటీనే పర్యవేక్షిస్తుంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయని జనసేన.. టీడీపీకి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకుంది. దాంతో 2024లో సీట్ల పంపకం వ్యవహారంతో పెద్ద ఎత్తున రెబల్స్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. దాంతో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పనితీరే కీలకం కానుంది.