హత్యాయత్నం కేసులో చంద్రబాబు ఏ1
ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు, బీరు బాటిళ్లు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో ఉమాపతిరెడ్డి పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏ1గా చేర్చుతూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఇటీవల జరిగిన ఘర్షణ ఘటనలపై ముదివీడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టీడీపీ నేతలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు మేరకు కేసులు నమోదు అయ్యాయి. గాయపడిన పోలీసులు, పోలీసు అధికారులు ఫిర్యాదులు ఇచ్చారు.
ఈ కేసుల్లో ఇప్పటికే వందల మందిపై నమోదు కాగా, పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సహా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, దమ్మాలపాటి రమేష్, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని తదితరులపై కేసులు నమోదయ్యాయి.
ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతోపాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు, బీరు బాటిళ్లు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో ఉమాపతిరెడ్డి పేర్కొన్నారు.