నెత్తురోడిన రహదారులు.. 2 ప్రమాదాల్లో 8 మంది మృతి
నాగయ్య కుటుంబం కర్మకాండ కార్యక్రమాన్ని ముగించుకుని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చక్రాయపేట నుంచి వేంపల్లి, ఎర్రగుంట్ల, కడప మీదుగా గువ్వలచెరువుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాయలసీమలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు కారు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లాలో కారును కంటైనర్ ఢీకొనడంతో ఐదుగురు, వైఎస్సార్ జిల్లాలో కారు బోల్తా పడి ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో సోమవారం రాత్రి కారును కంటైనర్ ఢీకొట్టి.. అదే వేగంతో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం వడ్డెపల్లెకు చెందిన బుద్ధిగారి నాగయ్య (45), వల్లెపు చిన్నవెంకటమ్మ(50), నాగలక్ష్మిదేవి (38), కారు డ్రైవరు షరీఫ్ (35) అక్కడికక్కడే మృతిచెందారు. లోయలో పడిన కంటైనర్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నాగయ్య కుటుంబం కర్మకాండ కార్యక్రమాన్ని ముగించుకుని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చక్రాయపేట నుంచి వేంపల్లి, ఎర్రగుంట్ల, కడప మీదుగా గువ్వలచెరువుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వేగంగా వెళుతున్న కారు బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగింది. పుట్టువెంట్రుకల వేడుక నిమిత్తం కారులో కర్నూలు పాతబస్టాండు ప్రాంతం నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కర్నూలు పాతబస్టాండు ప్రాంతంలో నివసిస్తున్న భగత్‌సింగ్ (34), నాగలక్ష్మి (70), కియాన్ సింగ్ (9 నెలల చిన్నారి) ప్రాణాలు కోల్పోయారు.