టీడీపీ, జనసేన సమన్వయ కమిటీలో 60% గోదావరి జిల్లాల నేతలే.. కారణం అదేనా?
జనసేనకు ఆ జిల్లాల్లోనే ఎక్కువ పట్టుందని భావించం ఓకే గానీ, టీడీపీ కూడా అదే బాట పట్టడమే ఆలోచించాల్సిన విషయం.
ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని టీడీపీ, జనసేన పార్టీలు ఒక అవగాహనకు వచ్చేశాయి. తొలి సమన్వయ కమిటీ సమావేశం కూడా సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. అయితే ఇందులో రెండు పార్టీల నుంచి పాల్గొన్న నేతల్లో అత్యధిక మంది గోదావరి జిల్లాలవారే కావడం విశేషం. జనసేనకు ఆ జిల్లాల్లోనే ఎక్కువ పట్టుందని భావించం ఓకే గానీ, టీడీపీ కూడా అదే బాట పట్టడమే ఆలోచించాల్సిన విషయం.
జనసేన నుంచి ముగ్గురు గోదావరి నేతలే..
సమన్వయ కమిటీలో జనసేన నుంచి పవన్ కల్యాణ్, మనోహర్ మినహా ఉన్న ఐదుగురిలో ముగ్గురు గోదావరి జిల్లా నేతలే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), గత ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసిన బొమ్మిడి నాయకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాధ్యుడు కందుల దుర్గేష్ సమన్వయ కమిటీలో ఉన్నారు.
టీడీపీ నుంచీ వాళ్లే..
ఇక టీడీపీ నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఆచంట మాజీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమన్వయ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తే రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యుల్లో దాదాపు 60 శాతం మంది గోదావరి జిల్లాల నేతలే ఉండటం గమనార్హం.
అక్కడే పొత్తుకు పీటముడి పడబోతుందా?
జనసేనకు గోదావరి జిల్లాల్లోనే పట్టు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. గోదావరి జిల్లాల్లో టీడీపీకీ గట్టి పట్టే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా గోదావరి జిల్లాల్లోనే ప్రభంజనం ప్రధానంగా సాగుతుంది. రేపు సీట్ల విషయంలో రెండు పార్టీలకూ అక్కడే పీటముడి పడే అవకాశాలు ఎక్కువ. దీన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికే సమన్వయ కమిటీలో ఎక్కువ మంది ఆ జిల్లాల వారికే చోటిచ్చారేమో అన్న చర్చ నడుస్తోంది.