దేశంలో విస్తరిస్తున్న ప్రకృతి సేద్యం - 17 రాష్ట్రాల్లో 10 లక్షల హెక్టార్లకు విస్తరించిన సాగు
దేశంలో ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సాగు గణనీయంగా విస్తరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 16 లక్షల 78 వేల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది.
దేశంలో ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సాగు గణనీయంగా విస్తరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 16 లక్షల 78 వేల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో 2,403 హెక్టార్లలో 2002 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 6.30 లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్లలో సేంద్రియ సాగు చేస్తుండటం విశేషం. ఇక గుజరాత్‌లో అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లలో 2.49 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్ వెల్లడించింది.
బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్‌ను రెండ్రోజుల క్రితమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది.
ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తిస్థాయి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలు ఈ పోర్టల్ తెలియజేస్తుంది. దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ఈ పోర్టల్ దోహదపడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.