మురికి కాల్వలో దిగిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎందుకంటే..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. సమస్యల పరిష్కారంతోపాటు పనిలో పనిగా ప్రజల్లో పరపతి పెంచుకోడానికి, ప్రచారం చేసుకోడానికి, మీడియాను ఆకర్షించడానికి చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. కానీ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే మురికి కాల్వలో దిగి తన నిరసన తెలిపారు. కాల్వలో దిగి, ఆ కాల్వ గట్టునే కూర్చుని అక్కడినుంచి కదిలేది లేదన్నారు. ఇంతకీ ఎమ్మెల్యేకి కలిగిన ఇబ్బంది ఏంటి..? ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య ఏంటి..? నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి […]
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. సమస్యల పరిష్కారంతోపాటు పనిలో పనిగా ప్రజల్లో పరపతి పెంచుకోడానికి, ప్రచారం చేసుకోడానికి, మీడియాను ఆకర్షించడానికి చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. కానీ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే మురికి కాల్వలో దిగి తన నిరసన తెలిపారు. కాల్వలో దిగి, ఆ కాల్వ గట్టునే కూర్చుని అక్కడినుంచి కదిలేది లేదన్నారు. ఇంతకీ ఎమ్మెల్యేకి కలిగిన ఇబ్బంది ఏంటి..? ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్య ఏంటి..?
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంట అనే ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుంది. అది రైల్వే ప్రాపర్టీ అంటూ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం మానేశారు. కానీ అక్కడ జనావాసాలున్నాయి. గతంలో రైల్వే లైను కోసం వారిని తరలించాలని చూసినా, అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఇప్పటి అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు అండగా నిలిచారు.
అయితే అటు రైల్వే అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో డ్రైనేజీ సమస్య మాత్రం అలాగే ఉంది. వర్షాల సమయంలో డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లలోకి నీళ్లు చేరుతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారుల తీరుని నిరశిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ ప్రాంతంలో డ్రైనేజీలోకి దిగి ఆందోళన చేపట్టారు. డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని, మురికి నీరు ఇళ్లలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా ఉమ్మారెడ్డి గుంట డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఈ దశలో మరోసారి ఆ ప్రాంతానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెళ్లారు ఎమ్మెల్యే. అంతే.. స్థానికులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉండగా కాల్వలో దిగారు, తమరు అధికారంలోకి వచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.
అక్కడ డ్రైనేజీ నిర్మాణానికి లిఖిత పూర్వక హామీ ఇచ్చేవరకు తాను మురికి కాల్వలోనే ఉంటానని భీష్మించారు. మురికి కాల్వలో నిలబడి నిరసన తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురికి కాల్వలో దిగడంతో అధికారులు షాకయ్యారు.
ఇటీవల స్వపక్షంలో విపక్షంలా కొంతమంది తనను ఇబ్బంది పెడుతున్నారని, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, తన ప్రాంతంలో వేలు పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యేలు, ఎంపీలు దైవాంశ సంభూతులేమీ కాదని, అందరూ కార్యకర్తలను గౌరవించాలని ప్లీనరీలో మాట్లాడారు. తాజాగా ఆయన మురికి కాల్వలో దిగి నిరసన తెలిపి మరోసారి కలకలం రేపారు.