అక్కడ టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టింది.. ఇక్కడ ప్రకృతి పగబట్టింది

ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు పెట్టుకున్నారు నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఏపీలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. కనీసం తమకు పోస్టర్లు వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. మెట్రో పిల్లర్లను కూడా కబ్జా చేశారని, బ్యానర్లలో మోదీని హేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది. […]

Advertisement
Update:2022-07-03 08:20 IST

ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు పెట్టుకున్నారు నరేంద్రమోదీ. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ఏపీలో అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. కనీసం తమకు పోస్టర్లు వేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు బీజేపీ నేతలు. మెట్రో పిల్లర్లను కూడా కబ్జా చేశారని, బ్యానర్లలో మోదీని హేళన చేస్తున్నారని కూడా మండిపడ్డారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది.

ఇక ఏపీ విషయానికొస్తే.. ఇక్కడ ఎవరూ వారికి అడ్డుపడలేదు.. సో బీజేపీ నేతలకు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు వేసుకున్నారు, ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కానీ ఇక్కడ ప్రకృతి బీజేపీపై బగబట్టింది. బ్యానర్లు, ఫ్లెక్సీలు వేసుకున్నంతసేపు వాతావరణం బాగానే ఉంది. కానీ సడన్ గా మోదీ సభ జరగాల్సిన భీమవరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రధాని పర్యటన సందర్భంగా బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులు ఈదురు గాలుల ధాటికి నేలకూలాయి. అటు ప్రధాని పాల్గొనాల్సిన సభా ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో రేపు సభ ఎలాగా అని తలలు పట్టుకున్నారు బీజేపీ నేతలు.

అక్కడ అవమానం.. ఇక్కడ స్వాగతం..
తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ లో ఉండకుండా పర్యటనలకు వెళ్లేవారు సీఎం కేసీఆర్. ఈసారి మాత్రం ఆయన నగరంలోనే ఉన్నారు. కానీ మోదీకి స్వాగతం పలికేందుకు ఆయన వెళ్లలేదు, సరికదా అదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మాత్రం కేసీఆర్ స్వాగతం పలికారు. అయితే మోదీ ఇక్కడ బీజేపీ కార్యక్రమం కోసం వచ్చారు కాబట్టి, సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ పాటించనక్కర్లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఏపీలో మాత్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ వస్తున్నారు కాబట్టి, సీఎం జగన్ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌ పోర్టులో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ స్వాగతం పలుకుతారు.

అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భీమవరంలోని సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ బహిరంగ సభలో మోదీ, జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి ఇద్దరూ తిరిగి వెళ్తారు, అక్కడ ప్రధానికి సీఎం వీడ్కోలు చెబుతారు. ఇదీ షెడ్యూల్. తెలంగాణలో కేసీఆర్ కనీసం మోదీకి మొహం కూడా చూపించలేదు. ఇక్కడ అధికారిక కార్యక్రమం కాబట్టి.. పర్యటన మొత్తం సీఎం జగన్ ఆయన వెంట ఉంటారు. ఒకేసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటన కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది.

Tags:    
Advertisement

Similar News