అన్నాడిఎంకెలో వర్గపోరు…. బీజేపీ సహాయం కోరిన పన్నీరు సెల్వం
తమిళనాడు రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోబోతోందా..ఇప్పటికిప్పుడు ఆ ప్రయత్నాలు చేయకపోయినా రాబోయే రోజుల్లో అక్కడి రాజకీయాల్లో కూడా వేలు పెట్టవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. అన్నాడిఎంకెలో బహిర్గతమైన ఆధిపత్య పోరు సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తమిళనాడులో తన ప్రాబల్యం చూపించుకోవడం కమల దళానికి అంత తేలిక కాదు. అయినా రాష్ట్రాలను మింగేయాలన్న ఆలోచన ఉన్న బిజెపి గోతికాడ నక్కలా ఎదురు చూస్తూంటుందని ఇటీవల మహారాష్ట్ర లో జరుగుతున్న సంఘటనలు […]
తమిళనాడు రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోబోతోందా..ఇప్పటికిప్పుడు ఆ ప్రయత్నాలు చేయకపోయినా రాబోయే రోజుల్లో అక్కడి రాజకీయాల్లో కూడా వేలు పెట్టవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. అన్నాడిఎంకెలో బహిర్గతమైన ఆధిపత్య పోరు సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
తమిళనాడులో తన ప్రాబల్యం చూపించుకోవడం కమల దళానికి అంత తేలిక కాదు. అయినా రాష్ట్రాలను మింగేయాలన్న ఆలోచన ఉన్న బిజెపి గోతికాడ నక్కలా ఎదురు చూస్తూంటుందని ఇటీవల మహారాష్ట్ర లో జరుగుతున్న సంఘటనలు రుజువుచేస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం(ఓపిఎస్) అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాలతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించారు.
అయితే జాతీయ కార్యవర్గ సమావేశాల హడావిడిలో ఉన్న వారు ఓపిఎస్ కు సమయం ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. కానీ ఓపిఎస్ మాత్రం తన పరిస్థితిని కొందరి పెద్దలకు వివరించినట్లు చెబుతున్నారు.
ఇదంతాఎందుకు..
ఎఐఎడిఎంకె సమన్వయకర్త మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం (ఓపిఎస్), సహ సమన్వయకర్త మరో మాజీ సీఎం పళని స్వామి(ఈపిఎస్) ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. క్రమంగా ఈ పోరు తారా స్థాయికి చేరుకుంటోంది. పన్నీరు సెల్వంను పార్టీనుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆపీసు బేరర్ల సమావేశం ఉంటుందని ఆదివారం నాడు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే కొన్ని గంటల్లోనే పార్టీ సమన్వయకర్త ఓ.పన్నీరు సెల్వం (ఓపిఎస్) మరో ప్రకటన విడుదల చేస్తూ ఆ సమావేశ నిర్వహణ చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
” సమన్వయకర్త, సహ సమన్వయకర్త ఇద్దరి ఆమోదంతో మాత్రమే సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశానికి నేను అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అన్నాడీఎంకే క్యాడర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.” అని పన్నీరు సెల్వం పేర్కొన్నారు.
గురువారం జరిగిన ఆఫీసు బేరర్ల సమావేశంలో ఈపిఎస్ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఓఎపిఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన విరోధులను ప్రజలు, పార్టీ కార్యకర్తలు తప్పక శిక్షిస్తారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జనరల్ కౌన్సిల్ ఓపిఎస్ ను సమన్వయకర్తగా ఆమోదించలేదని, ఇకపై ఆయన సమన్వయకర్త కాదని ఈపిఎస్ సన్నిహితుడు, న్యాయశాఖ మాజీ మంత్రి సి.వి షణ్ముగం ప్రకటించారు.
పన్నీరు సెల్వం పేరు తొలగింపు ..
ఇదిలా ఉండగా, పార్టీ అధికారపత్రిక ‘పురచ్చి తలైవి నమదు అమ్మ’ వ్యవస్థాపకుల జాబితా నుండి పన్నీర్ సెల్వం (ఓపిఎస్) పేరు తొలగించారు. శనివారం వరకు, పేపర్‌లో ఈపిఎస్, ఓపిఎస్ ల ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు, పళనిస్వామి పేరు మాత్రమే వ్యవస్థాపకుడిగా కనబడుతోంది.
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ సంకల్పం ప్రకారం 80% క్యాడర్ మద్దతు ఉన్న నాయకుడే పార్టీ నాయకుడని మాజీ మంత్రి సెల్లూర్ కే రాజు అన్నారు. “ఎంజీఆర్, జయలలిత, ఓపీఎస్, ఈపీఎస్‌ల మాదిరిగానే ఒక సామాన్య కార్యకర్త కూడా అన్నాడీఎంకే అధినేత కాగలడు అన్నారు. అన్నాడీఎంకే కు చెందిన మరో మాజీ మంత్రి, తిరుమంగళం ఎమ్మెల్యే ఆర్‌బీ ఉదయకుమార్ మాట్లాడుతూ ఈపీఎస్‌లా పార్టీని, క్యాడర్‌ను నడిపించే ధైర్యం,సామర్ధ్యం పన్నీర్‌సెల్వంకు లేదని అన్నారు.
మొత్తం మీద ఈ పరిణామాలతో పన్నీరు సెల్వం కు పార్టీ నుంచి ఉద్వాసన పలికే సూచనలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం ఢిల్లీ వైపు చూస్తున్నారు. జయలలిత మరణానంతరం, గతంలో కూడా సంక్షోభం ఏర్పడినప్పుడు ఆయన ప్రధాని మోడీ, అమిత్ షాలతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.
అందుకనే పార్టీలో నెలకొన్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించి మద్దతు పొందాలనుకున్నారు. ఆయనకు సపోర్టు చేస్తే ఇప్పటికిప్పుడు బిజెపి కి ఒరిగేదేమీ లేనప్పటికీ భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చనే ఆలోచనతో బీజేపీ ఓపిఎస్ ను దగ్గరికి తీసే అవకాశాలు ఉన్నాయి. ఇక పన్నీరు సెల్వం భవితవ్యం వచ్చే నెలలో జరిగే సర్వ సభ్యసమావేశంలో తేలనుంది.