షిండే స‌హా శివ‌సేన రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు

మహారాష్ట్రలో టగ్ ఆఫ్ వార్ ఉధృతమవుతోంది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేతో స‌హా 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీచేశారు. వీటికి ఈనెల 27లోగా సమాధానాలివ్వాలని ఆదేశించారు. పార్టీ విప్ సునీల్ ప్రభు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజ‌రైనందుకు ఈ చర్య తీసుకుంటున్నామని, మీ వాదనలను లిఖితపూర్వకంగా వివరిస్తూ మీ డాక్యుమెంట్లను సోమవారం సాయంత్రం 5 గంటలకల్లా పంపాలని ఈ నోటీసుల‌లో కోరారు. ఈ లోగా మీరు మీ సమాధానాలు చేర‌వేయ‌ని […]

Advertisement
Update:2022-06-25 12:20 IST

మహారాష్ట్రలో టగ్ ఆఫ్ వార్ ఉధృతమవుతోంది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేతో స‌హా 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీచేశారు. వీటికి ఈనెల 27లోగా సమాధానాలివ్వాలని ఆదేశించారు.

పార్టీ విప్ సునీల్ ప్రభు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజ‌రైనందుకు ఈ చర్య తీసుకుంటున్నామని, మీ వాదనలను లిఖితపూర్వకంగా వివరిస్తూ మీ డాక్యుమెంట్లను సోమవారం సాయంత్రం 5 గంటలకల్లా పంపాలని ఈ నోటీసుల‌లో కోరారు. ఈ లోగా మీరు మీ సమాధానాలు చేర‌వేయ‌ని పక్షంలో మీరు చెప్పేదేమీ లేదని భావించాల్సి వస్తుందని, ప్రొసీజర్ ప్రకారం తదుపరి చర్య తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ కార్యాలయం హెచ్చ‌రించింది.

ఇక నిన్న మొన్నటివరకు కాస్త మెతక వైఖరి ప్రదర్శించిన సీఎం ఉద్ధవ్ థాక్రే.. కూడా కఠిన చర్యలకు ఉపక్రమించారు. పార్టీని వీడి వెళ్లాలనుకుంటున్నవారు వెళ్లిపోవచ్చని, తిరుగుబాటును సహించేది లేదన్నట్టు హెచ్చరించారు. బాలాసాహెబ్ పేరును ప్రస్తావించిన పక్షంలో లీగల్ చర్యలకు పూనుకుంటామన్నారు.

శివసేన (బాలాసాహెబ్) పేరిట కొత్త పార్టీని పెట్టాలని, ఇందుకు దీన్ని ఈసీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలని షిండే వర్గం యోచిస్తున్నట్టు మొదట వార్తలు వచ్చాయి. దీనిపైనే ఉద్ధవ్ తీవ్రంగా స్పందించారు. నేరుగా శివసైనికులకు, మధ్యస్థాయి నాయకులకు ఆయన హెచ్చరిక చేస్తూ ఇదే జరిగితే స‌ఖబడ్దార్’ అని వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు.

అటు తాము ఆరు తీర్మానాలను ఆమోదించామని, బాలాసాహెబ్ థాక్రే ప్రవచించిన హిందుత్వ ఐడియాలజీని పాటించాలని నిర్ణయించామని సేన నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. సమైక్య మహారాష్ట్ర అన్న సిధ్ధాంతంపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసినవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన కూడా హెచ్చరించారు. పార్టీని వీడినవారిపై చర్య తీసుకోవడానికి సీఎం ఉద్ధవ్ థాక్రేకి పూర్తి అధికారాలున్నాయని, ఇలాంటివారు బాలాసాహెబ్ పేరును వాడుకోరాదని ఆయన అన్నారు.

డిప్యూటీ స్పీకర్ ‘కోర్టు’ లా వ్యవహరించాలి
రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంటున్నారని, కానీ ఇది లీగల్ ఆర్గ్యుమెంట్ పై ఆధారపడి ఉంటుందని మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీహరి అనేయ్ విశ్లేషించారు. శివసేనకు, రెబల్ ఎమ్మెల్యేలకు వారివారి అభిప్రాయాలను డిప్యూటీ స్పీకర్ ఆలకించిన తరువాతే వారి (రెబల్ సభ్యులు) అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన పక్షంలో గవర్నర్ జోక్యం చేసుకుంటారని, కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఏర్పడలేదని ఆయన చెప్పారు.

ఇటు ముంబై, అటు గౌహతి నుంచి అందే అభ్యర్థన లేఖలలోని వైఖరిని బట్టి డిప్యూటీ స్పీకర్ ‘కోర్టు’ లా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఇది లెజిస్లేచర్ లోనే గాక, జ్యుడీషియరీ పరిధిలోకి కూడా వస్తుందన్నారు. ప్రత్యేక ప్రాతిపదిక మీద ఇలాంటి విషయాలు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ముంబైలోని రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లవద్ద భద్రతను ఉపసంహరించారని వచ్చిన వార్తలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.

Tags:    
Advertisement

Similar News