శ్రీవాణి ట్రస్ట్ పై అసత్య ప్రచారం.. కేసుల నమోదుకు టీటీడీ నిర్ణయం..

శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం (SRIVANI) ట్రస్ట్ పై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ట్రస్ట్ కి వచ్చే విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందంటూ.. ఇష్టం వచ్చినట్టు ఫేక్ పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రస్ట్ విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలను సహించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేసినవారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేశారు అధికారులు. మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల […]

Advertisement
Update:2022-06-07 03:15 IST

శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణం (SRIVANI) ట్రస్ట్ పై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. ట్రస్ట్ కి వచ్చే విరాళాల సొమ్ము పక్కదారి పడుతోందంటూ.. ఇష్టం వచ్చినట్టు ఫేక్ పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే ట్రస్ట్ విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలను సహించేది లేదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారం చేసినవారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేశారు అధికారులు.

మారుమూల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రారంభించినదే శ్రీవాణి ట్రస్ట్. ఈ ట్రస్ట్ కి విరాళాలు ఇచ్చే దాతలు కనీసం 10వేల రూపాయలను ఇవ్వాల్సి ఉంటుంది. 10వేల రూపాయల విరాళం ఇచ్చిన దాతలకు అదనంగా 500 రూపాయలతో వీఐపీ దర్శన టికెట్ కేటాయిస్తారు. ఇలా ఎంతమంది విరాళం ఇస్తే, అంతమందికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ ఇస్తారు. 10వేల రూపాయలకంటే తక్కువ విరాళం ఇచ్చినా ట్రస్ట్ స్వీకరిస్తుంది కానీ, వీఐపీ బ్రేక్ దర్శనం వారికి కేటాయించే అవకాశముండదు.

ఇక ట్రస్ట్ సేవలు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 501 శ్రీవారి ఆలయాల నిర్మాణం జరిగింది. రెండేళ్లలో మరో 1030 ఆలయాల నిర్మాణం పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. విరాళాలు ఇచ్చినవారికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ కూడా ఇస్తుండటంతో.. దర్శనాల విషయంలో దళారీ వ్యవస్థ తగ్గిపోయింది. గతంలో చాలామంది బ్రేక్ దర్శనాల కోసం రికమండేషన్ లెటర్లతోపాటు, దళారీలకు కూడా భారీగానే డబ్బులు సమర్పించుకునేవారు. అలాంటి వారంతా ఇప్పుడు అధికారికంగా ట్రస్ట్ కి విరాళం ఇచ్చి బ్రేక్ దర్శనాలకు అవకాశం పొందుతున్నారు.

వాస్తవాలు ఇలా ఉంటే.. అనవసరంగా టీటీడీకి చెడ్డపేరు తెచ్చేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారంటూ అధికారులు మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ పై అసత్యాలు ప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని టీటీడీ అధికారులు హెచ్చరించారు. అసత్య వార్తలు సృష్టించి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫేక్ వార్తలను సృష్టించేవారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని టీటీడీ హెచ్చరించింది.

Tags:    
Advertisement

Similar News