ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం.. ఈపీఎఫ్ వడ్డీరేటు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.1 శాతానికి వడ్డీ రేటును తగ్గించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) మార్చిలో ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఇది గత నాలుగు దశాబ్దాలలో డిపాజిట్లపై అందిస్తున్న అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం. ఈ నిర్ణయం వల్ల 6 కోట్ల మంది ఈపీఎఫ్ […]
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.1 శాతానికి వడ్డీ రేటును తగ్గించింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) మార్చిలో ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. ఇది గత నాలుగు దశాబ్దాలలో డిపాజిట్లపై అందిస్తున్న అత్యల్ప వడ్డీ రేటు కావడం గమనార్హం.
ఈ నిర్ణయం వల్ల 6 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లపై ప్రభావం పడనున్నది. గువహటిలో ఈపీఎఫ్ఓ కేంద్ర ధర్మకర్తల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జారీ చేసిన ఈపీఎఫ్ఓ ఆఫీస్ ఆదేశాల ప్రకారం.. ఈపీఎఫ్ స్కీమ్‌లోని ప్రతి సభ్యునికి 8.1 శాతం వడ్డీని క్రెడిట్ చేసేందుకు ప్రభుత్వ ఆమోదాన్ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఈపీఎఫ్ఓపై వడ్డీ రేట్లను చాలాసార్లు తగ్గించింది. 2019-20లో ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ అమలు చేయగా, 2018-19లో 8.65 శాతంగా, 2017-18లో 8.55 శాతంగా ఉండేది. చివరిసారిగా 2011-12లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.1 శాతానికి దగ్గరగా ఉంది. ఇక, ప్రస్తుత ఏడాది మార్చిలో ఈపీఎఫ్ఓ కింద 15.32 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు నమోదయ్యారు.